Gongidi Trisha: గొంగిడి త్రిష కంటే మోనాలిసా ఎక్కువా…?
ఎవరినైనా హీరో చేయాలన్నా.. జీరో చేయాలన్నా… సోషల్ మీడియా ఈ రోజుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఎవరి గురించైనా అనవసర ప్రచారం చేయాలన్న.. అవసరమైన ప్రచారం చేయాలన్నా సరే సోషల్ మీడియాది కీలక భూమిక. ఈ మధ్యకాలంలో ప్రతి చిన్న విషయాన్ని హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు నెటిజన్లు. ఇటీవల మహా కుంభమేళాలో మోనాలిసా (Monalisa) అనే అమ్మాయిని సోషల్ మీడియాలో తెగ ఫేమస్ చేసేసారు జనాలు. ఎక్కడ చూసినా సరే ఆమెకు సంబంధించిన ఫోటోలు లేదంటే వీడియోలు మాత్రమే సోషల్ మీడియాలో కనపడుతున్నాయి.
ఇక ఆమె క్రేజ్ చూసిన వరల్డ్ మీడియా కూడా ఆమెకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఆమెకు మంచి ప్రాధాన్యత లభించడంతో… ఇక సినిమా వాళ్లు కూడా ఆమె వెంట పడ్డారు. ఒక దర్శకుడు ఆమెకు మణిపూర్ బ్యాక్ డ్రాప్ లో తీసే సినిమాలో అవకాశం కూడా ఇచ్చాడు. దీనికి సంబంధించి ఇటీవల బయటికి వచ్చిన కొన్ని లుక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కుంభమేళాలో పూసలు, దండలు, బ్యాగులు అమ్ముకోవడానికి వచ్చిన మోనాలిసా ఈ రేంజ్ లో ఫేమస్ అవుతుందని ఆమె కూడా ఊహించలేదు.
మన తెలుగువారైతే ఆమెను ఐశ్వర్యరాయ్ తో కూడా పోల్చడం మొదలుపెట్టారు. అయితే ఈ క్రమంలో అండర్ 19 మహిళల ప్రపంచ కప్ లో రాణించి సంచలనం సృష్టించిన గొంగిడి త్రిషారెడ్డి (Trisha Reddy) అనే అమ్మాయిని మాత్రం జనాలు మర్చిపోయారు. అండర్ 19 ప్రపంచ కప్ లో సెంచరీ చేసిన ఈ అమ్మాయి హిస్టరీ చాలామందికి తెలియదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రాంతానికి చెందిన త్రిష రెడ్డిని క్రికెటర్ ను తండ్రి చేయడానికి చాలా కష్టాలు పడ్డారు. ఇందుకోసం ఆయన డ్రైవర్ గా కూడా పనిచేశారు.
ఇక అంతర్జాతీయ క్రికెటర్ గా ఆమెను తీర్చేదిద్దాలని ఆయన ఎన్నో త్యాగాలు చేసినట్లు వార్తల్లో వచ్చాయి. అయినా సరే ఈ విషయాలను మాత్రం మన తెలుగు యువత పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. ఎక్కడో కుంభమేళాలో కనబడిన అమ్మాయికి ఇచ్చిన ప్రాధాన్యత గొంగిడి త్రిషారెడ్డికి ఇవ్వకపోవడం బాధాకరం అంటూ కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






