అమెరికాను వణికిస్తున్న ట్రిపుల్ ఈ
అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రాన్ని ఒక అరుదైన, ప్రాణాంతక వైరస్ భయం వణికిస్తోంది. ఈస్ట్రన్ ఈక్వైన్ ఎన్కెఫలైటిస్ (ట్రిపుల్ ఈ) అనే ఈ వైరస్ బారినపడకుండా ముందు జాగ్రత్తగా అక్కడి 5 పట్టణాల్లో పాక్షిక లాక్డౌన్ విధించారు. ఈ వైరస్ దోమ కుట్టడం వల్ల సోకుతుంది. ఇటీవల 80 ఏళ్ల వృద్ధుడు ఈ వైరస్ బారినపడినట్టు గుర్తించడంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ వైరస్ సోకితే మరణాల రేటు 30 శాతం వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ముప్పు తీవ్రత ఉందని భావిస్తున్న ఆక్స్ఫర్డ్, డగ్లస్, సుటన్, వెబ్‌స్టర్ పట్టణాల్లో సాంయత్రం నుంచి ఉదయం వరకు లాక్డౌన్ అమలు చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత దోమల బెడద ఎక్కువగా ఉంటుంది కాబటి ఆలోపు బయట పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
పార్కులను, వినోద కేంద్రాలను మూసి వేస్తున్నారు. సెస్టెంబరు 30 వరకు ఈ వేళలు పాటించాలని, తర్వాత చలి తీవ్రంగా ఉండే మరో నెల 15 రోజుల పాటు సాయంత్రం 5 గంటలకల్లా ఇళ్లకు చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బోస్టన్‌కు 64 కిలోమీటర్ల దూరంలోని ప్లైమౌత్ పట్టణంలో ఒక గుర్రానికి ఈ వైరస్ సోకినట్టు గుర్తించారు. దాంతో అక్కడ కూడా అధికారులు సాయంత్రం నుంచి ఉదయం వరకు లాక్డౌన్ అమలు చేస్తున్నారు. కాగా దోమల ద్వారా సోకే ఈ వైరస్ మనుషుల్లో ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదు. దీనికి వ్యాక్సిన్, నిర్ధిష్టమైన చికిత్స లేవని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) పేర్కొంది. ఇది సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, మూర్చ వంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొంది.






