ఈ కారణాల వల్ల భారత్ పై… వర్ధమాన దేశాలకు నమ్మకం : జై శంకర్
వర్థమాన దేశాలు భారత్‌ను నమ్మినంతగా చైనాను విశ్వసించడం లేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఉద్ఘాటించారు. భారత్-జపాన్ భాగస్వామయ వృద్ధి పై నిక్కై ఫోరమ్ టోక్యోలో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. వర్ధమాన దేశాల వాణిని ఆలకించడానికి భారత్ గత ఏడాది రెండుసార్లు వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ శిఖరాగ్ర సదస్సుల్ని నిర్వహించింది. 125 వర్థమాన దేశాలు పాల్గొన్న ఈ సభలకు చైనా హాజరు కానేలేదు. దీన్ని బట్టి పేద దేశాల పట్ల చైనా శ్రద్ధ ఏమిటో తేలిపోతోందని జై శంకర్ అన్నారు.
జీ 20 అధ్యక్ష పదవిని భారత్ చేపట్టిన తరవాతనే పేద దేశాల గురించి ఆ సంఘం పట్టించుకుందని తెలిపారు. భారత్ చొరవ వల్లనే ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో సభ్యత్వం లభించిందని గుర్తు చేశారు. కొవిడ్ కాలంలో పేద దేశాలకు టీకాలనిచ్చి ఆదుకున్నామని తెలిపారు. ఈ కారణాల వల్ల భారత్‌పై వర్థమాన దేశాలకు నమ్మకం పెరిగిందన్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండిస్తున్న దేశాలు, భారత భూభాగాల దురాక్రమణను అదే స్ఫూర్తితో ఎందుకు ఖండిరచడం లేదని నిలదీశారు. తైవాన్‌పై చైనా దాడి చేస్తే బీజింగ్‌పై భారత్ ఆర్థిక ఆంక్షలు విధిస్తుందా అని ప్రశ్నించగా, అలాంటి ఆంక్షలు పాశ్చాత్య దేశాల విధానమని పేర్కొన్నారు.






