Iran-Israel: ఇరాన్-ఇజ్రాయెల్ దశాబ్దాల వైరం.. రణక్షేత్రంగా మరిన పశ్చిమాసియా..

ఇజ్రాయెల్ -ఇరాన్ (Israel-Iran) మధ్య శత్రుత్వం ఈనాటిది కాదు.. దశాబ్దాల కాలం నుంచి కొనసాగుతోంది. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను ఇరాన్ ప్రధాన శత్రువులుగా గుర్తించింది. ఆ తర్వాతి కాలంలోనూ శత్రుత్వం కొనసాగింది. టెహ్రాన్ అణ్వాయుధాలను ఉత్పత్తి చేస్తోందని ఇజ్రాయెల్ గత 20 ఏళ్లుగా ఆరోపిస్తూనే ఉంది. అయితే శాంతియుత ప్రయోజనాల కోసమే అణు కార్యక్రమం చేపడుతున్నట్లు ఇరాన్ చెబుతోంది. మరోవైపు ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) మాత్రం ఇరాన్ దగ్గర అణ్వాయుధాల ఉత్పత్తికి తగినంత యురేనియం నిల్వలు ఉన్నట్లు గతంలోనే హెచ్చరించింది. 2003 వరకు ఆ దేశం వ్యవస్థీకృత అణ్వాయుధ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఐఏఈఏ తోపాటు పాశ్చాత్యదేశాలు కూడా నొక్కి చెప్పాయి. ఇరాన్ మాత్రం.. అలాంటిదేమీ లేదని చెబుతూనే.. అణ్వాయుధాల తయారీకి అవసరమైన యురేనియం నిల్వలను అభివృద్ధి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశం నుంచి ముప్పు పొంచి ఉందని గ్రహించిన ఇజ్రాయెల్.. అణుకేంద్రాలే లక్ష్యంగా దాడులకు దిగింది.
బలహీన పడిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్
ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రత్యక్ష దాడులు చేయనప్పటికీ .. 40 ఏళ్లుగా ఆ దేశంతో పరోక్షంగా యుద్ధం చేస్తూనే ఉంది. ఉగ్రవాద అనుబంధ గ్రూప్‌ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి.. ఇజ్రాయెల్‌పైకి ఉసిగొల్పుతోంది. గాజాలో హమాస్(Hamas), లెబనాన్‌లో హెజ్‌బొల్లా(Hezbollah), యెమెన్‌లో హూతీ(hutis)లు, ఇరాక్, సిరియాలో మిలిషియా సంస్థలు ఆ కోవకు చెందినవే. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత ‘యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’ క్రమంగా బలహీనపడటం మొదలైంది. హమాస్ ఉగ్రవాదుల నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించి.. వారి స్థావరాలను నేలమట్టం చేసింది. సొరంగాలను సైతం వదల్లేదు. వారికి మద్దతుగా లెబనాన్ నుంచి హెజ్‌బొల్లా దాడులకు పాల్పడగా.. వారి మౌలిక వసతులను సైతం ఇజ్రాయెల్ దెబ్బతీసింది. ఈ తరహా చర్యలతో ఉగ్రనెట్‌వర్క్ బలహీన పడింది.
ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉందని ఎప్పుడో గ్రహించిన ఇజ్రాయెల్.. అనువైన సమయం కోసం వెయిట్ చేసింది. ఓ వైపు ఉగ్రనెట్‌వర్క్ బలహీనపడటం, మరోవైపు అణు కార్యక్రమానికి సంబంధించి అమెరికా చేస్తున్న ప్రతిపాదనలను ఇరాన్ పదే పదే తిరస్కరించడం ఇజ్రాయెల్‌కు బాగా కలిసి వచ్చాయి.ఇదే సమయంలో టెహ్రాన్ భారీ మొత్తంలో యురేనియం నిల్వలను సమకూర్చుకోవడం ఇజ్రాయెల్‌ను ఒకింత భయానికి గురి చేసింది. అణ్వాయుధాలను ఉత్పత్తి చేసి.. తమ దేశంపై ప్రయోగిస్తుందన్న భయంతో ముందుగానే ఆయా కేంద్రాలను నేల మట్టం చేయాలని నిర్ణయించి.. దాడులకు దిగింది. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా స్పష్టం చేశారు. ‘ మా మనుగడను సవాల్ చేసే ఇరాన్ ముప్పును తిప్పికొట్టేందుకే ‘ ఆపరేషన్ రైజింగ్ లయన్’ చేపట్టాం’ అని నెతన్యాహు(nethanyahu) బహిరంగ ప్రకటన చేశారు. ఇప్పటికే ఆలస్యమైందని, ముప్పును పూర్తిగా తొలగించేంత వరకు ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
మరోవైపు ఇరాన్ కూడా ప్రతిదాడులు ప్రారంభించింది. భారీ సంఖ్యలో డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఇంకెన్నాళ్లు కొనసాగుతాయో చెప్పలేని పరిస్థితులు తలెత్తాయి. ఇప్పటికే రెండు యుద్ధాలతో సతమతమవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తాజా పరిస్థితులు ఇంకెలాంటి ప్రభావం చూపిస్తాయోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.