జీ7 దేశాలకు అమెరికా సమాచారం… ఏ క్షణమైనా
హమాస్ నేత ఇస్మాయిల్ హనియెపై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఏక్షణమైనా దాడిచేసే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. 24 నుంచి 24 గంటల్లోపే ఇది జరగవచ్చని అమెరికా, ఇజ్రాయెల్, జీ-7 దేశాలు అంచనా వేస్తున్నాయి. దాడిని దీటుగా ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్, దాని మిత్ర దేశం అమెరికా సర్వశక్తులూ కూడగడుతున్నాయి. తాజా పరిస్థితులపై జీ7 దేశాల మంత్రులతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్, హెజ్బొల్లా ఏ క్షణంలోనైనా దాడులు చేసే ప్రమాదం ఉన్నట్లు తమకు సమాచారం ఉందని ఆయన వారికి వివరించారు. దాడులు కచ్చితంగా ఎప్పుడు ఉండొచ్చనేది మాత్రం తెలియదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను వీలైనంత త్వరగా చల్లబర్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్‌తో కలిసి సిద్ధమవుతున్నామని తెలిపారు. జోర్డాన్ రాజు అబ్దుల్లాతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్లో మాట్లాడి, ప్రాంతీయ ఉద్రిక్తతలను నిలువరించాలని కోరారు. జోర్డాన్ విదేశాంగమంత్రి ఇరాన్ వెళ్లి చర్చలు జరిపివచ్చారు.






