Delhi: అమెరికాలో లాబీయింగ్ రేస్.. పాకిస్తాన్ తర్వాతే భారత్….

అమెరికాలో లాబీయింగ్ కు చట్టబద్ధత ఉంది. అందుకే అక్కడ ఏం జరగాలన్న చట్టసభల్లో లాబీయింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన పాకిస్తాన్.. ఎప్పటినుంచో లాబీయింగ్ చేస్తూ, అగ్రరాజ్యానికి అనుంగు మిత్రుడిగా ఉంటోంది. భారత్ అలీన విధానం పుణ్యమా అని.. ట్రేడ్ టాక్స్ కే పరిమితమైంది. అయితే ఇటీవలి కాలంలో భారత్ కూడా రూటు మార్చింది. లాబీయింగ్ కొంతవరకూ చేస్తున్న భారత్.. అమెరికాతో ధృడమైన వాణిజ్య బంధాన్ని ఏర్పరచుకుంది. అణుఒప్పందంతో మరింతగా ఇరుదేశాలు ముందుకెళ్లాయి. అయితే వీటన్నింటినీ ఒక్క టారిఫ్ వార్ తో ట్రంప్ (Trump) సర్కార్ తునాతునకలు చేసింది.
ఆపరేషన్ సిందూర్ ముందు వరకూ పాక్ పై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం. చాలా సార్లు నేరుగా వార్నింగ్ కూడా ఇచ్చింది. అలాంటిది ఎప్పుడైతే పాకిస్తాన్ లాబీయింగ్ లో సక్సెస్ అయిందో.. ఒక్కసారిగా అమెరికా టోన్ మారిపోయింది. పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ నుంచి ఈజీగా రుణం దొరికింది. ట్రంప్ కు నోబెల్ ఇవ్వాలంటూ ప్రకటించిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. రెండు సార్లు ట్రంప్ తో భేటీ కూడా అయ్యారు. ఫలితంగా ఇప్పుడు పాక్, అమెరికా భుజంభుజం కలిపి రాసుకుంటూ తిరగుతున్నాయి. అదే సమయంలో భారత్ పై 50 శాతం టారిఫ్ ట్యాక్స్ విధించింది అగ్రరాజ్యం.
అయితే ఈ అదనపు సుంకాలు మరికొన్ని రోజుల్లో అమల్లోకి రానుండగా.. భారత్ కూడా అప్రమత్తమైంది.
లాబీయింగ్ యత్నాలను ముమ్మరం చేసింది. ఈక్రమంలో అక్కడి ప్రభుత్వంతో వ్యూహాత్మక అంశాల్లో కమ్యూనికేషన్లు నిర్వహించడం, సోషల్ మీడియా, మీడియా రిలేషన్స్, డిజిటల్ ఆడిట్ వంటి వాటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక సంస్థను నియమించుకొంది. ఫారెన్ ఏజెంట్ రిజిస్ట్రేషన్ ఫైలింగ్ ప్రకారం.. భారత దౌత్య కార్యాలయం నెలకు 75,000 డాలర్లు చెల్లించేలా మూడు నెలలకు మెర్క్యిరీ పబ్లిక్ అఫైర్స్ సంస్థతో ఒప్పందం చేసుకొంది. ఇది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చింది.
మెర్క్యిరీ సంస్థ మాజీ రిపబ్లికన్ సెనెటర్ డేవిడ్ విట్టర్, 2020 ట్రంప్ ట్రాన్సిషన్ బృందం కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా చేసిన బ్రయాన్‌తో కలిసి భారత్ కోసం పనిచేస్తుంది. న్యూయార్క్ రాష్ట్రానికి సెనెటర్‌గా ఎన్నికైన తొలి ఇండో-అమెరికన్ కెవిన్ థామస్ సాయం చేయనున్నారు. ప్రస్తుతం ట్రంప్ (Donald Trump) చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ విలిస్‌కు మెర్క్యిరీ సంస్థతో సంబంధాలున్నాయి. 2024 వరకు ఆమె ఈ సంస్థ కోసం రిజిస్టర్డ్ లాబీయిస్ట్‌గా పనిచేశారు. ఆ తర్వాత శ్వేతసౌధంలో బాధ్యతలు చేపట్టారు. బ్రయాన్ గతంలో ట్రంప్ (Donald Trump) ప్రచార బృందంలో, జేడీవాన్స్ సెనెట్‌కు పోటీ చేసినప్పుడు పనిచేశారు.
ట్రంప్ (Donald Trump) రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత పాకిస్థాన్ చాలా వేగంగా ఆయనతో సంబంధాలను బలోపేతం చేసుకొంది. భారత్ మాత్రం కొంత వెనకబడిందనే విమర్శలు వచ్చాయి. ఇక పాక్ నాయకత్వం ట్రంప్ మాజీ బాడీగార్డ్ కీత్ షల్లర్ నిర్వహిస్తున్న లాబీయింగ్ సంస్థను నియమించుకొంది. మరోవైపు భారత్ ఇప్పటికే ట్రంప్ మాజీ సహాయకుడు జేసన్ మిల్లర్‌కు చెందిన ఎస్‌హెచ్‌డబ్ల్యూ పార్టనర్స్ ఎల్‌ఎల్‌సీని నియమించుకొని నెలకు 1.50లక్షల డాలర్లు చెల్లిస్తోంది. అమెరికాలో కీలకమైన ఒప్పందాలు, ఇతర పనులను పూర్తిచేసుకోవడానికి లాబీయింగ్ సంస్థలను నియమించుకోవడం కొత్తమీ కాదు. చాలా దేశాలు వీటితో కలిసి పనిచేస్తుంటాయి.