Washington: ట్రంప్ అభ్యంతరాలను భారత్ సీరియస్ గా తీసుకోవాలి… మోడీ సర్కార్ కు నిక్కీ హేలీ సూచన

వాషింగ్టన్-ఢిల్లీ మధ్య దూరం పెరగడం ఇరుదేశాలకు మంచిది కాదంటున్నారు అమెరికా మాజీ దౌత్యవేతతలు, నిపుణులు. ముఖ్యంగా ఆసియాలో చైనా ఆధిపత్యానికి గండి కొట్టగల సత్తా ఒక్క భారత్ కు ఉందని ట్రంప్ సర్కార్ కు సూచించిన అమెరికా రిపబ్లికన్ నిక్కీ హేలీ.. అదే సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు సంబంధించి ట్రంప్ అభ్యంతరాలను సైతం సీరియస్ గా తీసుకోవాలని భారత్ కు సూచించారు.భారత్‌కు మంచి మిత్రురాలిగా నిక్కీ హేలికి పేరుంది. న్యూఢిల్లీ-వాషింగ్టన్ మధ్య తాజా విభేదాలను ఉద్దేశించి ఆమె ఎక్స్‌లో పోస్టు చేశారు.
‘‘రష్యా (Russia) నుంచి చమురు విషయంలో ట్రంప్ లేవనెత్తిన అభ్యంతరాలను భారత్ సీరియస్‌గా తీసుకోవాలి. దాని పరిష్కారం కోసం వీలైనంత త్వరగా శ్వేతసౌధంతో కలిసి పనిచేయాలి. దశాబ్దాలుగా రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ఉన్న స్నేహం, విశ్వాసమే.. ప్రస్తుత ఒడుదొడుకులను దాటేందుకు బలమైన పునాదిగా ఉపయోగపడుతుంది.వాణిజ్యంలో, రష్యా చమురుపై అభిప్రాయభేదాలు వంటివి పరిష్కరించుకోవడానికి బలమైన చర్చలు, సంప్రదింపులు అవసరం. చైనా(Chiana)ను ఎదుర్కోవడానికి అమెరికాకు న్యూఢిల్లీలో మిత్రులు ఉండాలి అన్న అంశం చాలా ముఖ్యమైంది. దానిని ఏమాత్రం విస్మరించడకూడదు’’ అని ఆమె పోస్టు చేశారు.
ఆంక్షలు విధించి భారత్(India)ను అమెరికా దూరం చేసుకోవడంపై నిక్కీ హేలీ గతంలో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చైనాను ఎదుర్కోవాలన్న వ్యూహాత్మక లక్ష్యాల సాధనకు ట్రంప్ నిర్ణయాలు విపత్కరంగా మారాయని ఇటీవల ఆమె పేర్కొన్నారు. ఇటీవల ఓ పత్రికకు రాసిన కాలమ్‌లో ఆమె స్పందిస్తూ ‘‘ప్రపంచంలో ఆరోవంతు జనాభాకు కేంద్రం భారత్. అత్యంత యువ జనాభాతో చైనాను దాటేసింది. మరోవైపు డ్రాగన్ జనాభాలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ ’’ అని పేర్కొన్నారు.
మరో వైపు భారత్ లాంటి మిత్రదేశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూరం చేసుకోవడంపై మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. నిజమైన దౌత్య ప్రయత్నాలు జరగకుండా, అల్టిమేటంలు జారీ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. భారత్, అమెరికా మధ్య పోరు దురదృష్టకరమని అభివర్ణించారు. ‘‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోడీ మధ్య ఈ పోరాటం దురదృష్టకరం. సాధారణ వ్యాపార విధానంలో నిజమైన దౌత్య ప్రయత్నం లేకుండా గొప్ప దేశాలు ఎల్లప్పుడూ ప్రజలకు అల్టిమేటంలు ఇవ్వడం ద్వారా గొప్పతనాన్ని ప్రదర్శించవు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనలో చర్చలు పరస్పర సహకారం, గౌరవం ద్వారా జరిగాయి. కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆదేశాలు, ఒత్తిడితో జరుగుతున్నాయి’’ అని జాన్ కెర్రీ తెలిపారు.
రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేయడంపై అమెరికా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధానికి ఈ చమురు సొమ్ము ఉపయోగపడుతోందని.. భారత్ అవసరం వెతుక్కోని వ్యాపారం చేస్తోందని ట్రంప్ సలహాదారుడు పీటర్ నవారో తీవ్ర ఆరోపణలు చేశారు. ట్రంప్ 25శాతం పెనాల్టీలను భారత్ దిగుమతులపై విధించారు. ట్రంప్ కార్యవర్గం కీలక నాయకులు న్యూఢిల్లీపై తరుచు నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు చమురు ధరలు పెరిగితే 150 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడతారని భారత్ వాదిస్తోంది.