అంతరిక్ష కేంద్రంలోకి భారతీయులు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఐఎస్ఎస్)కి చేపట్టబోయే యాత్ర కోసం ప్రధాన వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ఎంపిక చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించింది. అనూహ్య పరిణామాల్లో ఆయన యాత్ర చేపట్టలేకుంటే, ప్రత్యామ్నాయ ఏర్పాటు ( బ్యాకప్) కింద గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ను ఎంపిక చేసింది. ఈ మిషన్‌ను అమెరికాతో సంయుక్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ దేశ అంతరిక్ష సంస్థ నాసా గుర్తింపు ఉన్న సర్వీస్ ప్రొవైడర్, యాక్సియమ్ సంస్థ సూచనల మేరకు ఇస్రో తాజా ఎంపిక చేపట్టింది.
ఐఎస్ఎస్కు యాక్సియమ్ నిర్వహించబోయే నాలుగో మిషన్ కోసం ఆ సంస్థతో తమ మానవసహిత అంతరిక్ష యాత్ర కేంద్రం ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇస్రో వివరించింది. ఇందుకు అనుగుణంగా నేషనల్ మిషన్ ఎసైన్మెంట్ బోర్డు ఇద్దరు గగన్యాత్రీల ( వ్యోమగాముల) పేర్లను సిఫార్సు చేసినట్లు వివరించింది. శుక్లా, నాయర్లకు ఈ వారం నుంచి శిక్షణ మొదలవుతుందని పేర్కొంది. ఐఎస్ఎస్లో వీరు శాస్త్రియ పరిశోధనలు, సాంకేతిక ప్రయోగాలు నిర్వహిస్తారు. ఆ యాత్రలో వీరు గడిరచే అనుభవం, వచ్చే ఏడాది భారత్ చేపట్టబోయే తొలి మావనసహిత అంతరిక్ష యాత్ర (గగన్‌యాన్)కు ఉపయోగపడనుంది. గగన్‌యాన్ కోసం ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాముల్లో శుక్లా, నాయర్లు ఉన్నారు. వీరితో పాటు గ్రూప్ కెప్టెన్లు అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్‌లు కూడా శిక్షణ పొందుతున్నారు. ఈ నలుగురిలో శుక్లా అత్యంత పిన్న వయస్కుడు (39) కావడం గమనార్హం.






