Delhi: వాణిజ్యం విషయంలో ద్వంద్వ ప్రమాణాలొద్దు.. నాటోకు భారత్ హితవు..

రష్యా-ఉక్రెయిన్ పోరు సమయంలో మిత్రదేశం నుంచి భారీగా చమురు కొనుగోలు చేసింది భారత్. అంతే కాదు.. అప్పట్లో భారత్ కు భారీ సబ్సిడీపై చమురును సరఫరా చేసింది రష్యా(Russia). అది భారత్ ఆర్థిక వ్యవస్థకు మేలు చేయగా.. రష్యా ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిందని చెప్పవచ్చు. అయితే ఈ పరిణామం అటు అమెరికా, నాటో, మిత్రదేశాలకు ఆగ్రహం తెప్పించింది. అవి ఎంతగా ఒత్తిడి చేసినా.. మన ఇంధన వ్యవస్థ అవసరాలే తమకు ముఖ్యమని ఇండియా స్పష్టం చేసింది. దాన్ని కొనసాగించింది కూడా…
ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాతో వాణిజ్యం కొనసాగించడంపై నాటో(NATO) చీఫ్ .. బ్రెజిల్, చైనా, భారత్‌కు హెచ్చరిక చేశారు. వాణిజ్యం కొనసాగిస్తే రెండో దశ ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. యూఎస్ కాంగ్రెస్ సభ్యులతో చర్చల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై మూడు దేశాలు దృష్టి సారించాలని అన్నారు.
రష్యాతో వాణిజ్యం కొనసాగించే దేశాలపై రెండో దశ ఆంక్షలు తప్పవంటూ నాటో చీఫ్ మార్క్ రట్ చేసిన వార్నింగ్‌పై భారత్ స్పందించింది. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు వొద్దని హితవు పలికింది. దేశ ప్రజల ఇంధన అవసరాలకు మించిన ప్రాధాన్యం మాకు మరొకటి లేదని నేను మరోసారి చెప్పదలుచుకున్నాను. ఈ దిశగా మార్కెట్‌లో ఉన్న అవకాశాలు, అంతర్జాతీయ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటాము. అయితే, ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావివ్వకూడదు’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు
ప్రస్తుతం రష్యాతో అత్యధికంగా ఇంధన వాణిజ్యం నెరపుతున్న దేశాల్లో యూరప్, నాటో దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. 2022 నుంచి యూరప్ దేశాలు అత్యధిక స్థాయిలో రష్యా ఎల్ఎన్‌జీ, పైప్‌లైన్ గ్యాస్‌ను దిగుమతి చేసుకున్నాయి. ఇక నాటో సభ్యదేశమైన తుర్కియే.. రష్యా చమురు ఉత్పత్తులను అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశంగా ఉంది. అయితే, రష్యా చమురు, సహజవాయు ఉత్పత్తుల దిగుమతులను 2027 నాటికల్లా తగ్గించాలని ఈయూ నిర్ణయం తీసుకుంది.