500 మందిని భారతీయులను అక్రమంగా .. అమెరికాకు తరలించా
కెనడా సరిహద్దుల నుంచి నాలుగేళ్లలో 500 మంది భారతీయులను అక్రమంగా అమెరికాకు పంపించినట్లు రాజీందర్ సింగ్ (51) అనే మానవ స్మగ్లర్ అంగీకరించారు. దీనిద్వారా 4,00,000 డాలర్లకుపైగా సంపాదించానని వెల్లడించారు. 2022లో గుజరాత్‌కు చెందిన జగదీశ్ పటేల్ కుటుంబం అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే క్రమంలో కెనడాలో మంచు కారణంగా ప్రాణాలు కోల్పోయింది. వారిని దేశం దాటించేందుకు హర్ష్‌కుమార్ పటేల్ ( 29), స్టీవ్ షాండ్లు సహకరించారు. వారిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా సింగ్ కోర్టులో వాంగ్మూలమిచ్చారు. పటేల్, షాండ్లను తాను ఎప్పుడూ కలవలేదని, కానీ స్మగ్లింగ్ ముఠా ద్వారా వారి గురించి తెలుసుకున్నానని తెలిపారు. తాను అక్రమంగా తరలించే వారిలో ఎక్కువ మంది గుజరాత్ నుంచే వస్తుంటారని, ఒక్కొక్కరు రూ.80 లక్షల దాకా ఇస్తారని వెల్లడిరచారు. సాధారణంగా కెనడాలోని బ్రిటిష్ కొలంబియా నుంచి అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోకి అక్రమంగా ప్రజలను తరలిస్తానని తెలిపాడు. అక్కడ ఉబర్ డ్రైవర్లను నియమించుకుంటానని వెల్లడిరచాడు. 2021 తర్వాత ప్రణాళికను మార్చామని, వాషింగ్టన్కు బదులుగా మిన్నెసోటాలోకి పంపుతున్నామని తెలిపాడు.






