Donald Trump: ఇవేంటి ఇంత అద్భుతంగా ఉన్నాయ్ : డొనాల్డ్ ట్రంప్!

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశానికి అధ్యక్షుడు, అపర కుబేరుడు. అలాంటి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సౌదీ అరేబియా (Saudi Arabia), ఖతార్ (Qatar) అధినేతల ప్రాభవం చూసి నోరెళ్లబెట్టారు. వారి రాజభవనాలను చూసి అసూయపడ్డానని స్వయంగా చెప్పారు. ఖతార్ రాజప్రాసాదాల ఠీవి, సౌకర్యాలు చూసి, ఇవేంటి ఇంత అద్భుతంగా ఉన్నాయి. వీటిని జీవితంలో కొనలేం అని వ్యాఖ్యానించారు. తన అత్యాధునిక ఎయిర్ ఫోర్స్ వన్ విమానం (Air Force One aircraft) కంటే అత్యంత విలాసవంత, అధునాతన బోయింగ్-747 రకం విమానాలను ఖతార్, సౌదీల్లో చూశానని చెప్పుకొచ్చారు. ఖతార్ నుంచి విమానాన్ని కానుక తీసుకోవడానికి సంకోచించబోనని బల్లగుద్దిమరీ చెప్పారు. ఖతార్ పాలకుడు అమీర్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ (Tamim bin Hamad Al Thani) రాజభవనం అమీర్ దివాన్ ను చూసి దిగ్బ్రాంతికి లోనయ్యానని వెల్లడిరచారు. స్వతహాగా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. నిర్మాణ నైపుణ్యం, కట్టడాల నేర్పు ఇట్టే పసిగడతా. మీ నివాసాలు భూలోక స్వర్గాలు. ఇంద్రభవనాలు, ఎంత పర్‌ఫెక్ట్‌గా కట్టారో అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు.