Flying Robo: చంద్రుడిపైకి ఫ్లయింగ్ రోబో.. మరో సంచలనం దిశగా చైనా..
చైనా(China) ఇటీవలి కాలంలో అద్భుతాలు చేయడం అలవాటుగా చేసుకుంటోంది. ఇటీవలి కాలంలో సౌర విద్యుత్ కోసం అతిపెద్ద ప్రాజెక్టు చేపట్టిన చైనా.. లేటెస్టుగా చంద్రుడిపైకి ఫ్లయింగ్ రోబోను పంపించనుంది. సాదారణంగా చంద్రుడి లాండి ఫ్రీజింగ్ ల్యాండ్ ఉన్నచోట ఏమైన రోవర్ లను దించితే అక్కడి పరిస్థితులకు తగినట్లుగా అవి సంచరించడానికి ఇబ్బంది పడతాయి. ఆ ఇబ్బందులన్నింటికీ చెక్ పెడుతూ.. అద్భుతంగా ఈ ఫ్లయింగ్ రోబోను ఆవిష్కరించినట్లు చైనా చెబుతోంది.
2026లో చేపట్టనున్న ఛాంగే-7(chang’e-7) మిషన్‌లో ఈ ఫ్లయింగ్ రోబో డిటెక్టర్ భాగం కానుంది. దీంతోపాటు ఓ ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌ను పంపించనుంది. ఈ యాత్రలో జాబిల్లిపై గడ్డకట్టిన మంచు, అది ప్రయాణించిన మార్గాలను స్పష్టంగా గుర్తించడమే లక్ష్యం. ఇక ఈ మిషన్ దక్షిణ ధ్రువంపై ల్యాండ్ కావడం దాని సామర్థ్యాన్ని తెలియజేస్తుంది.
‘‘చంద్రుడిపై గడ్డకట్టిన నీటిని విజయవంతంగా గుర్తించగలిగితే.. భూమిపై నుంచి అక్కడి నీటిని తరలించాల్సిన సమయం, ఖరీదును గణనీయంగా తగ్గిస్తుంది. దీంతో మానవ స్థావరాన్ని అక్కడ ఏర్పాటు చేయడం సాధ్యమవుతుంది. చంద్రుడి తర్వాత అంగారకుడి(Mars)పై అన్వేషణను సులువు చేస్తుంది. ఇక స్మార్ట్ రోబో కఠినమైన ప్రదేశాల వద్ద కూడా ల్యాండ్ కాగలదు. మనిషి ఎత్తైన ప్రదేశం నుంచి దూకితే ఎలా కాళ్లను కొంచెం మడతపెడతారో ఇది కూడా అలాగే చేస్తుందని సమాచారం.
ఇక ఫ్లయింగ్ రోబో ఒక్కసారి గాల్లోకి ఎగిరితే డజన్ల కొద్దీ మైళ్లు ప్రయాణించగలదని సౌత్ చైనా మార్నింగ్ పోస్టు కథనంలో వెల్లడించింది. ఎగుడుదిగుడు ప్రదేశాలపై కూడా ఇది నడిచేందుకు వీలుగా దీనికి పలు కాళ్లు అమర్చారు. దీనిలో నాలుగు ఇంధన ట్యాంక్‌లు ఉన్నాయి. చిన్న థ్రస్టర్లను కూడా అమర్చారు. దీంతో టేకాఫ్, ల్యాండింగ్ సులువుగా జరుగుతాయి. ఇప్పటికే చైనా సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించింది. దానిలోకి వ్యోమగాములను పంపి ప్రయోగాలు కూడా చేపట్టింది.






