పారిస్ ఒలింపిక్స్లో.. బిల్ గేట్స్ అల్లుడు
ఫ్రాన్స్ వేదికగా విశ్వక్రీడా సంబరం అట్టహాసంగా ప్రారంభమైంది. పారిస్ ఒలింపిక్స్ తొలి రోజు పోటీలతో పలు దేశాల పతకాల ఖాతా తెరిచాయి. ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రముఖ బిలియనీర్ బిల్గేట్స్ అల్లుడు నాయెల్ నాజర్ పోటీ చేస్తున్నాడు. ఈక్వెస్ట్రియన్ ఈవెంట్లో ఈజిప్టు తరపున బరిలో ఉన్నాడు. ఈక్వెస్ట్రియన్ ఈవెంట్లో మొత్తం మూడు విభాగాలుండగా, జంపింగ్ వ్యక్తిగత విభాగంలో నాజర్ పోటీ పడుతున్నారు. ఆగస్టు 5న ఈ మ్యాచ్ జరగనుంది. గతంలోనూ ఈజిప్టు తరపున ప్రాతినిధ్యం వహించాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్నాడు. ఈజిప్టియన్-అమెరికన్ అయిన నాజర్ ఐదేళ్ల నుంచి గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు. 10 ఏళ్ల వయసులో ఈక్వెస్ట్రియన్ జంపింగ్ చేయడం మొదలుపెట్టాడు. 2013, 2014, 2017లో ఎఫ్ఈఐ వరల్డ్ కప్ ఫైనల్కు అర్హత సాధించాడు. నాజర్ తల్లిదండ్రులు ఈజిప్టుకు చెందిన వారు కావడంతో ఒలింపిక్స్లో ఆ దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.






