ఉక్రెయిన్‌కు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఇస్తాం : బైడెన్
రష్యా భీకర దాడులతో అల్లాడిపోతున్న ఉక్రెయిన్‌కు తాము ఐదు వ్యూహాత్మక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. వాషింగ్టన్లో జరుగుతున్న నాటో దేశాధినేతల సదస్సు ప్రారంభోపన్యాసంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఈ సైనిక కూటమి ఎన్నడూ లేనంత శక్తిమంతంగా ఉందని ఆయన అభివర్ణించారు. అదే సమయంలో రష్యా-ఉక్రెయిన్ యుద్దం ఇప్పుడు పెనుమార్పు చోటు చేసుకొనే దశను ఎదుర్కొంటోందని తెలిపారు. ఉక్రెయిన్‌కు పేట్రియాట్, ఇతర ఆయుధ వ్యవస్థలను సరఫరా చేసేందుకు జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, రొమానియాతో కలిసి పనిచేస్తామని బైడెన్ వివరించారు. ఈ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని బైడెన్ జోస్యం చెప్పారు. ఉక్రెయిన్ కచ్చితంగా సురక్షితంగా ఉంటుందని, రష్యాకు మాత్రం రక్షణ లేదని వ్యాఖ్యానించారు. 13 నిమిషాలపాటు బైడెన్ ఎటువంటి తడబాటు లేకుండా ప్రసంగించారు. ఈ సదస్సుకు 32 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.






