ప్రధాని మోదీకి ఫోన్ చేసిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్
భారత ప్రధాని నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ ఫోన్ చేశారు. తమ దేశంలో మైనార్టీలపై హింసాత్మక దాడుల గురించి కూడా యూనస్ ప్రస్తావించారట. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, ఆ దేశం నుంచి భారత్కు వచ్చేసిన తర్వాత ఆ దేశంలోని మైనార్టీ హిందువులపై హింసాత్మక దాడులు జరగడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత స్వాతంత్ర వేడుకల్లో కూడా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో యూనస్ నుంచి మోదీకి కాల్ రావడం చర్చనీయాంశంగా మారింది. తమ సంభాషణ గురించి ఎక్స్ వేదికగా వెల్లడించిన ప్రధాని మోదీ.. ‘బంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిణామాల పై ఇద్దరం మాట్లాడుకున్నాం. ఆ దేశంలో హిందువులు, మైనార్టీలకు సరైన భద్రత కల్పిస్తామని మహమ్మద్ యూనస్ హామీ ఇచ్చారు. అనంతరం బంగ్లాదేశ్లో శాంతియుత, సుస్థిర, ప్రగతిశీల ప్రభుత్వ ఏర్పాటుకు భారత్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని మరోసారి పునరుద్ఘాటించాను.’ అని రాసుకొచ్చారు.






