ఆస్ట్రేలియాలో ఉద్యోగుల రక్షణకు… త్వరలో
ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉద్యోగుల సంరక్షణకు సరికొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తోంది. దీని ప్రకారం పని గంటలు పూర్తయిన తర్వాత తమ బాసులను పట్టించుకోవాల్సిన అవసరం లేకుండాపోతుంది. దీంతో వారికి పని నుంచి దూరంగా వ్యక్తిగత జీవితం గడిపే అవకాశం లభించనుంది. వాస్తవానికి ఈ చట్టాన్ని ఆస్ట్రేలియాలో ఫిబ్రవరిలోనే పాస్ చేశారు. వాస్తవానికి కొత్త చట్టం ఆస్ట్రేలియా పార్లమెంట్లోకి రాగానే పలు సంస్థలు దీనిని తీవ్రంగా విమర్శించాయి. ఇది పూర్తిగా తొందరపాటు చర్య అని, లోపభూయిష్టమని పేర్కొన్నాయి. ఈ కొత్త చట్టంలో సదరు ఉద్యోగి హోదా, యజమానితో మాట్లాడేందుకు తిరస్కరణలో అసహేతుకత, సంస్థలు చెప్పే కారణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం వంటి మినహాయింపులు ఉన్నాయి. కానీ, ఈ మినహాయింపుల పట్ల చట్టం అమలు కష్టమవుతుందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఆస్ట్రేలియాలోని ఫెయిర్ వర్క్ యాక్టోని లోపాలను పూడ్చేందుకు ఈ సరికొత్త చట్టాన్ని అమలు చేయనున్నారు. దీంతోపాటు తక్కువ వేతనాలు ఇవ్వడాన్ని క్రిమినలైజ్ చేసేందుకు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతోపాటు యజమానులు ఉద్యోగులను నియమించుకొనే చట్టాల్లో కూడా మార్పులు తీసుకురానున్నారు.






