భారత పౌరసత్వానికి గుడ్ బై … ఐదేళ్లలో 8.34 లక్షల మంది!
విదేశాల్లో మెరుగైన విద్య, ఉద్యోగావకాశాలు, వైద్య సదుపాయాలు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం వంటి కారణాలతో భారత పౌరసత్వం వదులుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన ఐదేళ్లలో 8.34 లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదులుకొని విదేశీ పౌరులుగా మారారు. కొవిడ్‌కు ముందు (2011-19) ఏటా సగటున 1.32 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఆ తర్వాత 2020-23 మధ్య వీరి సంఖ్య 20 శాతం పెరిగి సంవత్సరానికి 1.58 లక్షలకు చేరింది. భారత పాస్ పోర్టుతో అనేక దేశాలకు ప్రయాణించడానికి వీసా తప్పనిసరి. అయితే అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాల పాస్‌పోర్టులతో ప్రపంచంలో చాలా దేశాలకు వీసా రహిత ప్రయాణం చేయవచ్చనే భావన కూడా భారత పౌరసత్వాన్ని వదులుకోవడానికి దోహదం చేస్తోంది. దేశంలో ద్వంద్వ పౌరసత్వాన్ని అమలులోకి తెస్తే ఈ ధోరణికి అడ్డుకట్ట పడుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2018 నుంచి 2023 వరకూ భారతీయులు 114 దేశాల పౌరసత్వాన్ని పొందారు వీరిలో చాలామంది అమెరికా, కెనడా, అస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీలో స్థిరపడ్డారు. గత ఆరేళ్లలో 70 మంది పాకిస్థాన్ పౌరసత్వం స్వీకరించారు. విదేశాల్లో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో చైనా తర్వాత భారతీయులే (15 లక్షల మంది) అత్యధికం.






