భారత్ కు సాయం చేసేందుకు చేతులు కలిపిన 40 అమెరికా కంపెనీలు
వాషింగ్టన్: కరోనా మహమ్మారితో అల్లాడుతున్న భారత్‌కు సహాయం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికాతోపాటు ఫ్రాన్స్, బ్రిటన్, కువైట్, సింగపూర్ వంటి దేశాలు ఇండియాకు వివిధ రూపాల్లో సాయం చేస్తామని వెల్లడించాయి. తాజాగా అమెరికాకు చెందిన 40 దిగ్గజ కార్పొరేట్ సంస్థలు టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పడి భారత్‌కు సహాయం చేయాలని నిర్ణయించాయి. యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్ట్నర్షిప్ ఫోరం, బిజినెస్ రౌండ్‌టేబుల్ వంటి వాణిజ్య సంఘాల పర్యవేక్షణలో భారత్‌కు అవసరమైన సహకారం అందజేయాలని సోమవారం జరిగిన ఒక సమావేశంలో ఈ 40 సంస్థలు నిర్ణయానికి వచ్చాయి.
ఈ నిర్ణయం గురించి సమావేశం అనంతరం డెలాయిట్ సీఈఓ పునీత్ రెంజెన్ మాట్లాడారు. కొన్ని వారాల్లో సుమారు 20వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను భారత్‌కు పంపుతామని, దీనికి మొత్తం 40 సంస్థలు అంగీకారం తెలిపాయని వెల్లడించారు. ఇండియాకు అన్నివిధాల సాధ్యమైనంత సాయం చేయాలని టాస్క్‌ఫోర్స్ నిర్ణయించినట్లు పునీత్ తెలిపారు. భారత్ ఈ విపత్కర పరిస్థితి నుంచి అతి త్వరలోనే బయటపడి, పూర్వ స్థితికి చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రధాన వైద్య పరికరాలు, ఆక్సిజన్, టీకాలు సహా అత్యవసరమైన అన్ని సరఫరాలను భారత్‌కు అందజేస్తామని టాస్క్‌ఫోర్స్ వర్గాలు హామీ ఇచ్చాయి. ప్రపంచంలో కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే ప్రపంచం మొత్తం కలిసి పనిచేయక తప్పదని యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, సీఈఓ సుజాన్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. ఇలా ఒక దేశంలో తలెత్తిన ఆరోగ్య సంక్షోభాన్ని తొలగించేందుకు అంతర్జాతీయ స్థాయిలో కార్పొరేట్ సంస్థల టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు కావడం ఇదే తొలిసారి అని యూఎస్ విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్ పేర్కొన్నారు.







