ఈ-సిగరెట్లతో కరోనా ముప్పు!
ఈ-సిగరెట్లను వినియోగించే వారిలో కొవిడ్-19 ముప్పు తీవ్రంగా ఉంటోందని ఓ అధ్యయనంలో తేలింది. సాధారణ వ్యక్తుల కంటే వీరు 5-7 రెట్లు అధికంగా ఇన్ఫెక్షన్కు గురయ్యే ప్రమాదముందని వెల్లడైంది. భారత సంతతికి చెందిన స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శివానీ మాథుర్ గైహా ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. ఇందులో భాగంగా 13-24 ఏళ్ల వయసున్న 4,351 మంది జీవనశైలి, ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. ఈ-సిగరెట్ వినియోగం, పొగతాగే అలవాటు, కరోనా వైరస్ సోకడం తదితర వివరాలను సేకరించి, విశ్లేషించారు.
ఈ- సిగరెట్లు వినియోగించే వారికి కరోనా ముప్పు తీవ్రంగా ఉంటున్నట్టు గుర్తించాం. తమకేమీ కాదని, చాలామంది యువకులు అనుకుంటున్నారు. కానీ, వారి శ్వాసవ్యవస్థ బలహీనంగా ఉండటంతో సులభవంగా వైరస్‌కు గురవుతున్నారు. దగ్గు, అలసట, శ్వాస తీసుకోవడం ఇబ్బందులు వారిని ఎక్కువగా భాదిస్తున్నాయి. నికోటిన్ సిగరెట్లు రెండింటినీ వినియోగించే వారికి కొవిడ్-19 ముప్పు 2.6 నుంచి 9 రెట్లు, గత 30 రోజుల్లో పొగతాగిన వారికి 6.8 రెట్లు అధికంగా ఉంటోంది అని పరిశోధకులు వివరించారు.






