మన వంటిల్లే మనకు తగిన రక్ష
కరోనా సమయంలో వంటింట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
– డా జి. వి. పూర్ణచందు
ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, సెల్: 9440172642
పాండవుల వారసుడు పరీక్షిత్తు మహారాజు తక్షకుడి కాటు నుండి తప్పించుకోవటానికి ఎత్తైన ఒంటిస్తంభం మేడ కట్టుకుని, తనకు తాను ‘‘లాక్‘డౌన్’’ ప్రకటించుకుని, స్వీయ నిర్బంధంలో భద్రంగా ఉన్నాననే అనుకున్నాడు. కానీ, పరీక్షిత్తు ఆహార భద్రత పాటించక పోవటం వలన తక్షకుడు ఓ పండులో పురుగులా దూరి, ఆయన్ని కాటేశాడని మహాభారతంలో కథ.
బాహ్యజీవితానికి ఎన్ని తాళాలు వేసినా ఆహారభద్రతని అశ్రద్ధ చేస్తే పరీక్షిత్తుకు పట్టిన గతే పడుతుంది! కరోనా వ్యాధిలో ఎవరి భద్రత వారిదే! ఆహారభద్రత మరీ ముఖ్యం కూడా!
చికిత్సాకోవిదులు ‘కోవిడ్19’ అంటున్న ఈ వ్యాధి లోకాన్ని గడగడలాడిస్తోంటే, మన పాలకులు తామే పారద్రోలుతాం, జయిస్తాం.. అంటూ మూణ్ణెళ్ల తాళాలు ప్రకటించి, ఇప్పుడు అన్నీ తెరిచి మనల్ని సహజీవనం చెయ్యాలంటున్నారు! దేశీయులంతా తలా 14 రోజులు పడకెక్కటానికి సన్నద్ధంగా ఉండాలని ఏలినవారి అభిప్రాయం. ఈ వైరసుని వెళ్లగొట్టే ఔషధాలు, వ్యాక్సీన్లు లేవు. మనకు వ్యాధి రాకపోతే, అది ప్రభువులవారి మహిమ. వస్తే మన ఖర్మ. వ్యక్తి తన భద్రత తానే చూసుకోవాలన్నమాట!
కూరగాయలు, పండ్లను కడగండి…
కూరగాయల్ని, పండ్లని చిల్లుల బుట్టలో పెట్టి పంపు కింద ఒక నిమిషం పాటు ధారగా నీరుపడేలా ఉంచండి. ఒక్కో కాయనీ, పండునీ చేత్తో బాగా తోమి కడిగి, పొడిబట్టతో తుడిచి ఫ్రిజ్జులో భద్రపరచుకోండి. కూరగాయల్ని తరగబోయే ముందు మరోసారి కడిగి తుడిచి అప్పుడు వాడుకోండి. ఈ విషయమై అమెరికా ఆహార భద్రతా సంస్థ నాలుగంశాలు సూచిస్తోంది. కూరగాయలు తెచ్చుకున్నాక వాటిని వేరుచేయాలి. శుభ్రపరచుకోవాలి, చాలినంత ఉష్ణోగ్రత మీద వండుకోవాలి లేదా ఫ్రిజ్జులో భద్రపరచుకోవాలి. ఆహారపదార్థాలను 50-70°C మధ్య ఉడికించటం, ఫ్రిజ్జులో కనీసం 5°C వద్ద భద్రపరచాలి.
పురుగుమందులు చల్లితే కరోనా అంటదనీ, త్వరగా పండేలా చేయటానికి వాడే రసాయనాల వేడికి కరోనా వైరస్ చచ్చిపోతుందనీ కావాలని కొందరు అలాంటి హానికరమైన పనులు చేస్తున్నారు. వీటిని ప్రభుత్వం నిషేధించాలి.
పచారీ సరుకులకు క్వారంటైన్
బియ్యం, పప్పు, ఉప్పు సరుకుల్లో కరోనా వైరస్ ఉండకపోవచ్చు. కానీ, వాటిని అమ్మటానికి చేసే ప్యాకింగ్ పైన కరోనా లేదనలేం. అందుకని షాపు నుండి తెచ్చాక ఒకటి రెండు రోజులు ఆ ప్యాకెట్లను అంటుకోకుండా ఇంట్లో ఒక పక్కన అట్టేపెట్టి, శానిటైజరుతో శుభ్రం చేసి, చేతులు కడుక్కున్నాకే సరుకులు తెరవండి. నిలవుండే కూరగాయల్ని, పండ్లని కూడా వీలైతే ఇలా క్వారంటైన్లో ఉంచి కడుక్కోండి! గుడ్లను కూడా శుభ్రం చేశాకే వాడండి. ఆమ్లెట్లకన్నా బాగా ఉడికిన గుడ్లు సురక్షితం. కరోనా వైరసు శరీరానికి బైట ఎంతసేపు సజీవంగా ఉంటుందో తెలీదు. స్టీలుపైన ఇన్ని గంటలు, బంగారంపైన ఇన్నిగంటలూ అంటూ ఊహాగానాలు సాగుతున్నాయి. సరుకులకీ క్వారంటైను అందుకే!
బజారు తిళ్లు
అమెరికన్ ఆహారభద్రతా సంస్థ (ఎఫ్.డి.ఎ) Food Code 2017 Section 3-301.11లో ‘రెడీ టు ఈట్’ పదార్థాల గురించి చేసిన మార్గదర్శకాలు మనదేశానికి వర్తించవు. మురుక్కాల్వలమీద ఇడ్లీలు, బజ్జీలు వండి వడ్డిస్తుంటే జనం ఎగబడి కొని అక్కడే నిలబడి తినే పరిస్థితి మనది! భౌతిక దూరానికి అవకాశం లేని సందడి ఈ బజ్జీల బళ్ల దగ్గరే ఉంటుంది. ముఖపట్టీ(మాస్కులు), చేతితొడుగు(గ్లోవ్స్)లతో వండటం లాంటి నియంత్రణలేవీ లేవిక్కడ! అనేక అంటురోగాలకు తలుపులు తెరిచే కేంద్రాలివి. మన దేశంలో ఆహారపదార్థాల ప్యాకింగుల మీద వాటి వివరాల లేబుళ్ళు ఉండవు. మిరపబజ్జీలు, పునుగుల మీద లేబులు వేసి ఏం రాస్తారు? ఇలాంటి unwrapped bakery products కొనేప్పుడు జాగ్రత్త వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఒకసారి వండి అమ్మిన ఆహారపదార్థాల మీద కరోనా లేదని నిర్థారించలేం. అలాగని, వండిన పదార్థాలను పంపుకింద శుభ్రపరచుకోలేం! అందుకని, బైట వండిన వాటికి దూరంగా ఉండాలి. Prepare home-cooked meals అనేది ప్రపంచ ఆరోగ్యసంస్థ సూత్రం.
కూర ఎక్కువ, అన్నం తక్కువ తినండి!
తేలికగా అరిగే పదార్థాలు వండుకుంటే ఇలాంటి సమయంలో మంచిది. కూరలు ఎక్కువగా, అన్నం తక్కువగా తినేందుకు వీలుగా వండే విధానాలు మార్చుకోండి. వరి అన్నానికి ప్రాధాన్యత తగ్గిస్తే అందరికీ మంచిది. కూరగాయల్లో ఉండే ఆహార పీచు జీర్ణాశయ వ్యవస్థని శక్తిమంతం చేస్తుంది. తద్వారా రోగనిరోధకశక్తి పెరుగుతుంది. షుగరు, కొవ్వులు రక్తంలోకి అతిగా చేరకుండా చేస్తుంది. ఫైబరు చాలినంత తింటే కడుపు నిండిన సంతృప్తి కలుగుతుంది. అందువలన ఏదో ఒకటి తినాలనే యావ తగ్గుతుంది కూడా!
టిఫిన్లకు బదులు పెరుగన్నం
మినప్పిండి, మైదాపిండి, శనగపిండితో వంటకాలు బాగా తగ్గించండి. కరోనా ప్రమాదం ముగిసే సమయానికి స్థూలకాయులుగా జనం మారకూడదు. షుగరు, బీపీ, గుండెజబ్బుల విషయంలో కూడా ఈ మూడూ అపకారం చేసేవే. ఇదే అదనుగా మద్యపానం, ధూమ పానం వదిలేయండి! ప్రొద్దున్నపూట టిఫిన్లు మానేసి పెరుగన్నం లేదా చల్లన్నం తినటం వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది. వేడన్నంలో పెరుగు లేదా మజ్జిగ(చల్ల)కలిపి తింటే జలుబు తగ్గుతుంది. కరోనాని ఎదుర్కొనే శక్తి శరీరానికి కలుగుతుంది. అందులో కేరెట్ ముక్కలు, ముల్లంగి ముక్కలు, బీట్‘రూట్ ముక్కలు, తియ్యని పండుముక్కలు, ఉల్లి, కొత్తిమీర వగైరా కలిపి తాలింపు పెట్టిన కమ్మని దధ్యోదనం లేదా కర్డ్‘రైస్ ఇంకా ఆరోగ్యదాయకంగా ఉంటుంది. పెరుగన్నం గొప్ప ప్రో-బయటిక్ ఆహారం. పెరుగులో కూరగాయ ముక్కలు కలిపిన పెరుగుపచ్చడి ప్రీ-బయటిక్ ఆహారం కూడా అవుతుంది. ఇది తక్షణం వ్యాధినిరోధక శక్తిని పెంపు చేసేదిగా ఉంటుంది. ప్రొద్దున్నే మంచినీళ్లకు బదులు పలుచటి మజ్జిగ త్రాగే అలవాటు ఉత్తమం.
వంటింట్లో కరోనా నివారకాలు
కరోనా మనకు సోకకుండా రోగనిరోధకశక్తిని పెంచే ఆహార ఔషధాలు అనేకం మన వంటగదిలోనే అందుబాటులో ఉన్నాయి.
అల్లం టీ: అల్లం, వెల్లుల్లి, వాము కలిపి టీ కాచుకుని రోజూ 2,3 సార్లు తీసుకుంటూ ఉంటే పేగులు, ఊపిరితిత్తులు ద•ఢంగా ఉంటాయి. కరోనా పాజిటివ్ వచ్చినవాళ్లూ, రానివాళ్లు కూడా తీసుకోదగిన ఔషధం ఇది.
అశ్వగంథ: ‘‘పేరులేని వ్యాధికి పెన్నేరు’’ కరోనాకూ వర్తించే సామెతే! పెన్నేరు అంటే అశ్వగంథ. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అశ్వగంథాది చూర్ణం, అశ్వగంథారిష్ట లేదా అశ్వగంథాది లేహ్యం రోజూ వాడుకుంటే ఈ సమయంలో అందరికీ మేలు చేస్తుంది.
తులసి: తులసి అంటే తుల లేనిది, పోలికలేనిది, సాటిలేనిదని! పవిత్ర ఔషధం. గ్లాసు నీళ్ళలో కాసినన్ని తులసాకులు, చిటికెడు ముద్దకర్పూరం వేసి కొద్దిసేపు ఉంచిన తులసి నీళ్లని మంచినీళ్లకు బదులుగా రోజూ తాగండి! జీవకణాల ఉత్పత్తికి నిర్మాణాత్మక రసాయన చర్యల వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది. కఫదోషాన్ని, విషదోషాల్ని హరించే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువ. నీడన ఎండించిన తులసిని సమూలంగా దంచి, యాలకులపొడి, మిరియాలపొడి, పొదీనా పొడి కలిపి టీ కాచుకుని రోజూ త్రాగండి.
వాము: వాము పొడి కలిపి కాచిన నీరు త్రాగితే కఫం, వాతం తగ్గి, జఠరాగ్ని పెరుగుతుంది. కిరాణాకొట్లలో ‘థైమాల్’(వాంపువ్వు) దొరుకుతుంది. చిటికెడు వాంపువ్వుని నీళ్లలో కలిపి తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. కళ్ళె దగ్గు, జలుబు, తుమ్ములు ఆగుతాయి.
కొత్తిమీర: కొత్తిమీర రసాన్ని ఒక చిన్న గ్లాసులో తీసుకొని అందులో మిరియాలపొడి, తగినంత ఉప్పు కలిపి, రోజూ ప్రొద్దున పూట తాగుతూంటే వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. ధనియాలపొడి,
పసుపు పాలు: కొట్టిన పసుపు అరచెంచా తీసుకుని, ఒక గ్లాసు వేడి పాలలో కలిపి తాగితే గొంతు, శ్వాసనాళాలూ శుభ్రం అవుతాయి. గోల్డెన్ మిల్క్ అంటారు దీన్ని!
కర్పూరం: కొద్దిగా బియ్యం, ముద్దకర్పూరం కలిపి పలుచని వస్త్రంలో మూటగట్టి వాసన చూస్తూంటే శ్వాసనాళాలు ఊపిరితిత్తుల్లో వైరస్ తిష్ఠ వేయకుండా శుభ్ర పరుస్తుంది. ఇన్‘హేలర్ల కన్నా ఇది మెరుగైన పద్ధతి. వాముపొడిని కూడా ఇలానే వాసన చూడవచ్చు.
క్యారెట్, ముల్లంగి, కీర: క్యారెట్, ముల్లంగి, కీర ఈ మూడింటి జ్యూసు ఒక గ్లాసు చొప్పున రోజూ తాగుతుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కరోనా పాజిటివ్ వ్యక్తులకు రోజూ రెండు మూడు సార్లు ఈ జ్యూసు తప్పనిసరిగా ఇవ్వండి
నేలవేము: నేలవేముని భూనింబ, సుదర్శన పేర్లతో పిలుస్తారు. సుదర్శన ఘనవటి పేరుతో ఇది ఆయుర్వేద మందులషాపుల్లో దొరుకుతుంది. కరోనా భయం పోయేవరకూ ఇంటిల్లిపాదీ ఈ ఔషధాన్ని 1-2 బిళ్లలు రెండు పూటలా వేసుకుని తులసాకుల టీ తాగితే తప్పకుండా రోగనిరోధకశక్తి పదిలం అవుతుంది.
పిప్పళ్లు: పిప్పళ్ళు పచారీ కొట్లలో దొరుకుతాయి. వాటిని నేతితో దోరగా వేయించి మిక్సీ పట్టి చక్కెర పాకంలో కలిపి కుంకుడు కాయంత ఉండలు చేసుకోండి. ఒక్కో ఉండని చప్పరిస్తుంటే శ్వాసనాళం శుభ్రపడి ఆయాసం, కఫం, దగ్గు, కరోనా ఉపద్రవాలు తగ్గుతాయి.
బూడిద గుమ్మడి: బూడిదగుమ్మడికాయల కూర, పప్పు, పచ్చడి, పెరుగు పచ్చడి ఇవన్నీ పేగుల్నీ, ఊపిరితిత్తుల్నీ బాగుచేసి, వ్యాధి నిరోధకశక్తిని పెంచుతాయి. కరోనా పాజిటివ్ వచ్చినవారికి తప్పనిసరిగా బూడిదగుమ్మడిని ఏదో ఒక రూపంలో తీసుకోండి. బూడిద గుమ్మడి హల్వా చేసుకోండి. కూష్మాండ లేహ్యం లేదా కూష్మాండరసాయనం దీంతో తయారైన ఔషధాలే! ఇమ్యూనిటీని పెంచుతాయి.
వస: వసకొమ్ముని దంచిన పొడి పావుచెంచా తీసుకుని ఓ గ్లాసు నీళ్లలో కలిపి టీ లాగా కాచుకుని తాగితే వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. కఫాన్ని తగ్గిస్తుంది. దగ్గు, జలుబు తుమ్ముల్ని ఆపుతుంది. వైరస్ దోషాలకు విరుగుడుగా పనిచేస్తుంది.
వేసవారం: కరోనా ‘హెల్త్ ఎమర్జెన్సీ’ ముగిసేవరకూ తప్పనిసరిగా తీసుకోవల్సిన ఆహార ఔషధం ‘వేసవారం’. దీన్ని మీరు ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. ఒక చెంచా ఇంగువ, 2 చెంచాలు తడితక్కువ అల్లం ముద్ద, 4 చెంచాల మిరియాల పొడి, 8 చెంచాల జీలకర్ర, 16 చెంచాల పసుపు పొడి, 32 చెంచాల ధనియాలపొడి…వీటన్నింటికీ సరిపడినంత ఉప్పు చేర్చి ఒక సీసాలో భద్రపరచుకోండి. పసుపు కొమ్ములను మరపట్టిన పసుపుపొడి మాత్రమే వాడండి. ఈ ‘వేసవారం’ పొడిని కూరపొడిగా, సాంబారుపొడిగా, చారు (రసం) పొడిగా, కారప్పొడిగా వాడుకోవచ్చు. దీన్ని కలిపిన వంటకాలు రుచిగాఉంటాయి. మజ్జిగలో కలిపి తాగవచ్చు. దీని వలన శరీరంలో విషదోషాలు తగ్గుతాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇంటీల్లీపాదికీ విలువైన యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన గొప్ప ఫార్ములా ఇది! 15వ శతాబ్దికి చెందిన ‘క్షేమ కుతూహలం’ అనే వైద్య గ్రంథంలోది ఈ గొప్ప ఫార్ములా!
కరోనా మన శరీరంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే మాస్కులు, చేతుల పరిశుభ్రత, భౌతిక దూరం అనే మూడు సూత్రాలు ఉపయోగపదతాయి. కానీ, గ్రహపాటున వ్యాధి వచ్చినా ప్రాణాపాయ స్థితి కలగకుండా, ఏ లక్షణాలూ లేకుండా దాన్ని ఎదుర్కోగలగటానికి ఇన్ని ఉపాయాలను ఆయుర్వేదం చెప్తోంది.






