గోవా సిఎంకి కరోనా…
దేశవ్యాప్తంగా ప్రముఖులు అందరినీ పలకరిస్తున్న కరోనా తాజాగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ని కూడా వదల్లేదు. గోవా ముఖ్యమంత్రి కరోనా బారిన పడినట్టు నిర్ణారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బుధవారం ఉదయం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా గత కొన్ని రోజుల నుంచి తనతో సన్నిహితంగా ఉన్నవారందరూ తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. తనకు ఏ రకమైన అనారోగ్య లక్షణాలూ లేనప్పటికీ హోమ్ ఐసొలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నట్టు 47ఏళ్ల సావంత్ తెలిపారు. అదే విధంగా ఎప్పటిలాగే తన విధులను ఇంటి నుంచి నిర్వర్తిస్తానన్నారు. కోవిడ్ 19 వ్యాప్తిపై ఆయన మంగళవారం ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలోని కోవిడ్ కేర్ సెంటర్ల పనితీరును సమీక్షించారు. తొలుత కరోనా కేసులే లేనట్టు కనిపించిన గోవా అనంతరం తాను సైతం అంటూ కరోనా రేస్‌లో పాల్లొంటున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ చాలా రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికీ మెరుగైన స్థితిలో ఉన్న గోవాలో ప్రస్తుత కేసుల సంఖ్య 18006 కాగా మరణాలు కేవలం 2 మాత్రమే నమోదయ్యాయి. కరోనా బారిన పడిన నాల్గవ సిఎం… దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల మంత్రులు, కేంద్ర మంత్రులతో పాటు ముఖ్యమంత్రులకు కూడా కరోనా సోకుతున్న నేపధ్యంలో మన దేశంలో ఈ వ్యాధి బారిన పడిన నాలుగవ ముఖ్యమంత్రిగా సావంత్ నిలిచారు. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప, మధ్య ప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా సిఎం ఎమ్ ఎల్ ఖత్తార్లు ఆయనకంటే ముందుగా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.






