పాజిటివ్ గా ఉంటేనే కరోనాపై గెలుస్తాం…శిల్పారెడ్డి
తెలుగు రాష్ట్రాల్లో తొలి మిసెస్ ఇండియా, ఫిట్నెస్ ట్రైనర్, ఫ్యాషన్ డిజైనర్.. పలువురు సినీ ప్రముఖులకు దగ్గర బంధువు అయిన శిల్పారెడ్డి కరోనా పాజిటివ్ అనే విషయం తానే స్వయంగా చెప్పడం సంచలనంగా మారింది. అయితే చాలా మందికి స్ఫూర్తినిచ్చే ఫిట్నెస్తో కనిపించే శిల్పారెడ్డి దీనిని తొందరగానే అధిగమించారు. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత తొలిసారిగా ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు అనుభవాలు పంచుకున్నారు. ఆమె మాటల్లోనే…
మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు కొన్ని వారాల క్రతం మా ఇంటికి వచ్చి తిరిగెళ్లే సమయంలో అనారోగ్యం పాలయ్యారు. అనంతరం ఆ ఫ్రెండ్ ఇంట్లో వారికి కొన్ని కరోనా లక్షణాలు కనిపిస్తే. అప్పుడు వారే మాకు చెప్పడం బాధ్యతగా భావించి చెప్పారు. తర్వాత ఏ లక్షణాలూ లేనప్పటికీ మా కుటుంబ సభ్యులం మొత్తం కోవిడ్ పరీక్షలకు వెళ్లాం. ఆ పరీక్షల్లో నేను, నా భర్త పాజిటివ్‌గా తేలింది.
బెదరలేదు…జాగ్రత్తలు వదలలేదు
పాజిటివ్ అని తెలిశాక కూడా ఏమీ బెంబేలెత్తిపోలేదు. ఇంట్లో అందరికీ అవగాహన కలిగించాం. ఎటువంటి అనారోగ్య లక్షణాలూ లేవు కాబట్టి వర్కవుట్ ఎప్పటిలానే వర్కవుట్స్ చేశా. విటమిన్లు, పసుపు తదితర సహజమైన వ్యాధి నిరోధకాలను బాగా వినియోగించాం. రోజుకి 2 సార్లు ప్రాణయామ, మెడిటేషన్ చేశాం. 13 రోజుల్లో నాకు నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు మా ఇంట్లో అందరూ నెగిటివ్. మేం ఎలాంటి మందులు వాడలేదు.నిజానికి ఇప్పుడు చికిత్స చేస్తున్న ఆసుపత్రుల్లో కూడా మరీ అవసరమైతే తప్ప ఏ రకమైన మందులూ ఇవ్వడం లేదు. కేవలం విటమిన్లు మాత్రమే ఇస్తున్నారు.
అపోహలు పోవాలనే వీడియో…
ఈ కరోనా వ్యాధి విషయంలో సామాజికంగా ఉన్న అపోహలు తొలగించాలి. అదే నా ఆలోచన ఆలోచించాను. ప్రతి ఒక్కరూ మెచ్యూరిటీతో ఆలోచించాలి. అందుకే వీడియో పోస్ట్ చేశాను. ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులకు కరోనా సోకుతోంది. మన దగ్గరా చాలా మంది ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా చుట్టుపక్కలవారు ఏమనుకుంటారో అనే భయంతో తాము పాజిటివ్ అయినా బయటకు చెప్పడం లేదు. ఈ పరిస్థితి మారాలి.
వైరస్‌కి తన పర బేధాల్లేవ్…
వైరస్ ఎంతటి ఆరోగ్యకరమైన శరీరంలోకైనా వస్తుంది. అందుకు మనం ముందుగానే సిద్ధం కావాలి. ఎవరికో వచ్చింది మేం అన్నీ కరెక్ట్‌గా తింటున్నాం. వ్యాయామం చేస్తున్నాం మాకు రాదు అనుకోవడద్దు. ఓ అంచనా ప్రకారం ఇది జనాభాల్లో 75శాతం మందికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్త్, వెల్నెస్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.
పాజిటివ్‌గా ఉండండి…
కరోనా పాజటివ్‌గా తేలినవాళ్లలో చాలా మంది సులభంగా కోలుకుంటున్నారు. అయితే చనిపోయినవారి గురించే అందరూ ఎక్కువగా చెబుతున్నారు. అలా చెప్పడం వల్ల చాలా మందిలో నెగిటివిటీ వస్తుంది. అది చాలా ప్రమాదకరం. జాగ్రత్తలు తీసుకోండి కానీ భయపడద్దు. . నా వీడియో చాలా మంది లో పాజిటివ్ థాట్స్ పెంచిందని చెబుతుంటే సంతోషంగా అనిపించింది.






