మృతదేహంలో 6గంటల తర్వాత వైరస్ ఉండదు: జవహర్‌రెడ్డి
కరోనా వ్యాధితో మరణించిన రోగుల అంత్యక్రియల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వ్యక్తమవుతున్న అభ్యంతరాలను ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి ఖండించారు. ఇలాంటి వివక్ష సరికాదని, అవగాహన లోపంతో కరోనా మృతుల అంత్యక్రియల్లో ఇబ్బందులు పెట్టొద్దని ఆయన ప్రజలను కోరారు. కరోనా వ్యాధితో మరణించినప్పటికీ… ఆ మృతదేహంలో అత్యధికంగా 6గంటలు మాత్రమే వైరస్ మనగలుగుతుందని, ఆ తర్వాత వైరస్ ఉండదని స్పష్టం చేశారు.
కాబట్టి ప్రజల్లో ఆందోళన అనవసరం అన్నారు. మృతుల సంఖ్య కూడా అంత ప్రమాదకరంగా ఏమీ లేదన్నారు. ఒక్క కరోనా మృతి సంభవించింది అంటే 666 కేసులు ఉన్నట్టు లెక్క అని వివరించారు. లాక్‌డవున్ సడలింపులు ఆ తర్వాత పెరిగిన అంతర్రాష్ట్ర రవాణా వల్ల పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగిందని తెలిపారు. అయితే వ్యాప్తి ఇంకా అదుపులోనే ఉందని ప్రస్తుతం రాష్ట్రంలో ఒకరి నుంచి 1.12 మందికి మాత్రమే కరోనా సోకుతోందని, అదే కరోనా వ్యాప్తి రెండు దాటితే మనం ప్రమాదంలో పడినట్టే భావించాలన్నారు. కేసుల వెల్లవు నేపధ్యంలో వైద్యలపై పెరుగుతున్న భారం తగ్గించేందుకు పలు రకాల చర్యలు తీసుకుంటున్నామని జవహర్‌రెడ్డి అన్నారు.






