టెస్టుల్లో ప్రభుత్వమా? ప్రైవేటా? ఎవరు..?
కరోనా విజృంభణకు వేదికగా మారిన హైదరాబాద్ నగరంలో రోజుకు వేల సంఖ్య లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీనికి పరీక్షల సంఖ్య పెరగడంతో పాటు పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్స్‌కు కూడా అనుమతులు ఇవ్వడం కారణంగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు పరీక్ష ఫలితాలలో నిక్కచ్చితనం మీద సందేహాలు రేగుతున్నాయి.
దీనికి కారణం ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబుల్లో నిర్వహిస్తున్న పరీక్షల ఫలితాలలో భారీ వ్యత్యాసాలు ఉండడం.ఉదాహరణకు రోజుకు 100 మందికి ప్రభుత్వ ఆధ్వర్యంలో పరీక్షలు చేస్తే పాజిటివ్‌ల సంఖ్య 20 నుంచి 25శాతానికి మించడం లేదని, అదే ప్రైవేటు ల్యాబుల్లో చూస్తే అది 70శాతం వరకూ ఉంటోందని అంటున్నారు. దీంతో కొందరు ప్రభుత్వం నిర్వహించే పరీక్షల ఫలితాలని సమర్ధిస్తుంటే మరికొందరు ప్రభుత్వం కావాలని పాజిటివ్‌ల సంఖ్య తగ్గించి చూపిస్తోందంటూ ఆరోపిస్తున్నారు.
ఈ నేపధ్యంలో ప్రైవేటు ల్యాబుల పరీక్ష ఫలితాల ఖచ్చితత్వాన్ని నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లో అనుమతి పొందిన ప్రైవేటు ల్యాబులలో 13 ల్యాబులకు నోటీసులు జారీ చేసింది. ప్రైవేటు ల్యాబులు పరీక్షలు నిర్వహిస్తున్న తీరు అవలంబిస్తున్న పద్ధతులపై సమాచారం సేకరించనుంది.






