తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్న కరోనా మరణాలు
ఏపీలో 10, తెలంగాణలో 7..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కరోనా తాకిడితో అల్లాడుతున్నాయి. నిన్నా మొన్నటి దాకా దేశవ్యాప్తంగా చూస్తే కాస్త మెరుగ్గానే ఉన్నట్టు కనిపించిన తెలుగు రాష్ట్రాలు లాక్ డవున్ ఎత్తివేత తర్వాత ఒక్కసారిగా కరోనా విశ్వరూపానికి వేదికయ్యాయి. గత కొన్ని రోజులుగా తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య సగటు రోజుకి 1000కి చేరువవుతుంటే ఆంధ్రా కూడా తానేమీ తగ్గలేదన్నట్టు కరోనా కేసుల సంఖ్య నమోదు చేస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య 10వేలు ఎప్పుడో దాటిపోగా… మరణాల సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది.
పరీక్షలు పెంచుతున్నాం కాబట్టి కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వాలు చెబుతుంటే సరే అనుకున్నా… మరి పెరుగుతున్న మరణాల సంఖ్య ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రోజుకి ఒకటి రెండు…ఇలా సింగిల్ డిజిట్ దాటకుండా ఉంటూ వచ్చిన మరణాలు అప్పుడే డబుల్ డిజిట్‌కు చేరుకుంటుండడంతో ప్రభుత్వాల మాటల్లోని డొల్లతనం బయటపడుతోంది. ఏదేమైనా.. తెలుగు రాష్ట్రాలు కూడా కరోనా కు కేరాఫ్ గా మారుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు మరింత పకడ్బందీ చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ నేపధ్యంలో శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకూ గడచిన 24 గంటల్లో… తెలుగు రాష్ట్రాలలో నమోదైన కేసుల వివరాలిలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం పాజిటివ్ సంఖ్య 740, కోలుకున్నవారు 263, మరణించిన వారి సంఖ్య 10. అలాగే తెలంగాణలో చూస్తే… 985 పాజిటివ్ కేసులు నమోదైతే 78 మంది డిశ్చార్జ్ కాగా 7గురు మరణించారు.






