15న తెరుచుకోనున్న బద్రీనాథ్ ఆలయ ద్వారాలు
ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం అయిన బద్రీనాథ్ ఆలయ ద్వారాలు మే 15న (శుక్రవారం) తెరుచుకోనున్నాయి. శుక్రవారం తెల్లవారు జామున 4:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ఆలయ ప్రధాన అర్చకుడు సహా 27 మంది మాత్రమే హాజరుకానున్నారు. భక్తులకు అనుమతి లేదు. కరోనా మహమ్మారి విస్తరణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన లాక్డౌన్ నిబంధనల మేరకు ఉత్తరాఖండ్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 29న కేదార్నాథ్ ఆలయ ద్వారాలను తెరిచారు. అప్పుడు కూడా ఆలయ ప్రధాన అర్చకుడు సహా 16 మందికి అనుమతి ఇచ్చారు. కాగా, చార్ధామ్ ప్రాంతం మంచు కొండల నడుమ ఉండటంతో ఏటా శీతాకాలంలో ఆరు నెలలపాటు ఆలయ ద్వారాలను మూసివేసి వేసవిలో తిరిగి తెరువడం ఆనవాయితీగా వస్తున్నది. ఆ ఆనవాయితీనే ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు.






