భారతీయులు వారానికి 60గంటలు శ్రమించాలి
–దేశ ఆర్ధిక పునర్మిర్మాణానికి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సూచనలు
కోవిడ్ –19 ధాటికి ఆర్ధికరంగం కుదేలవుతున్న నేపధ్యంలో దేశ ఆర్ధిక పునర్మిర్మాణానికి భారతీయులు వారానికి కనీసం 60గంటలు పనిచేయాల్సి ఉంటుందని ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ప్రముఖ ఆంగ్ల దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ధిక రంగాన్ని గాడిలో పెట్టడానికి రెట్టింపు శ్రమకు మనం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
జాగ్రత్తలతో…జీవిద్దాం…
కనీసం మరో 12 నుంచి 18 నెలల పాటు కరోనా వైరస్‌తో కలిసి జీవించడం మనం నేర్చుకోవాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. సంస్థలు జాగ్రత్తలు తీసుకుంటూ కార్యకలపాలు కొనసాగించాలన్నారు. కంపెనీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రస్తావిస్తూ… సంస్థలోని ఉద్యోగులలో ఎవరైతే ఎక్కువగా వైరస్‌కు గురయ్యే అవకాశం ఉందో అలాంటి వారిని గుర్తించేందుకు అవసరమైన డేటా ఉండాలని, అలాంటి కంపెనీలు తిరిగి పని ప్రారంభించవచ్చునన్నారు. అలాగే గౌన్లు, గ్లవ్స్, మాస్క్స్, గాగుల్స్… ఇలాంటివన్నీ అందుబాటులో ఉంచుతూ తమ ఉద్యోగులకు అత్యుత్తమ రక్షణ ఎంత వీలైతే అంతగా కల్పించాలన్నారు. అలాగే షిఫ్ట్‌ల సంఖ్య పెంచడం ద్వారా సోషల్ డిస్టెన్సింగ్‌ను మరింత మెరుగ్గా పాటించడం, తక్కువ రిస్క్ కలిగిన ఉద్యోగులకు తగిన రక్షణ పరికరాలు అందించిన తర్వాతే వారిని కార్యాలయాల్లో పనికి ఉపయోగించడం చేయాలన్నారు. అలాగే తక్కువ రిస్క్ ఉన్నవారు అన్ని జాగ్రత్తలతో, పెద్ద వయసు వారికి వర్క్ ఫ్రమ్ హోమ్, లేదా వారి వ్యక్తిగత ఆఫీసుల నుంచి పనిచేసే వీలు కల్పించడం చేయాలన్నారు. కంపెనీల నిర్ణయాలు అభిప్రాయాలను బట్టి కాకుండా డేటాను బట్టి ఉండాలన్నారు. గౌన్స్, గ్లవ్స్ వంటివి కొనుగోలు చేయడంతో పాటు తాము తీసుకుంటున్న జాగ్రత్తలను, తమ డేటా మొత్తాన్ని ప్రభుత్వానికి కంపెనీలు నివేదించిన అనంతరం తాము తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కాబట్టి తమ సంస్థలను పునఃప్రారంభించేందుకు అనుమతి ఇవ్వమంటూ అభ్యర్ధించాలన్నారు.
అందరికీ పరీక్షలా? అయితే 37ఏళ్లు…
ప్రస్తుతం భారత దేశం చేస్తున్న కరోనా పరీక్షల గురించి మాట్లాడుతూ రోజుకు భారతదేశం లక్ష మందికి పరీక్షలు నిర్వహించినప్పటికీ, ప్రతి ఒక్కరినీ పరీక్షించడానికి 37 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. ప్రస్తుతానికి కనుచూపు మేరలో వ్యాక్సిన్ లేదని, ఒకవేళ అది సమీప భవిష్యత్తులో వస్తుందనుకున్నా… అది మన భారతదేశానికి ఎంతగా నప్పుతుందో, మన జీన్స్‌పై ఎలా పనిచేస్తుందో చెప్పలేమన్నారు. ఈ పరిస్థితుల్లో భారతీయులు కనీసం 12 నుంచి 18 నెలల పాటు నావెల్ కరోనావైరస్తో సహజీవనం చేయడం నేర్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. కాబట్టి…ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో సరికొత్త సాధారణ జీవితాన్ని కరోనా వైరస్‌తో కలిపి సాధన చేయాల్సి ఉంటుందని, అలాగే కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న పెద్ద వయసువారిని ఆ ప్రమాదం తక్కువగా ఉన్నవారు కాపాడాల్సి ఉంటుందన్నారు.
పరిశ్రమిస్తామని…ప్రతిన బూనాలి…
కోవిడ్–19లాక్ డవున్ ఫలితంగా దెబ్బతిన్న భారతీయ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు భారతీయులు మరింత ఎక్కువగా, గట్టిగా శ్రమించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మరో 2–3ఏళ్ల పాటు వారంలో 6 రోజులు, అలాగే రోజుకు 10గంటలు పనిచేస్తామని మనం ప్రతిన బూనాల్సి ఉందన్నారు. తద్వారా ఆర్ధిక రంగాన్ని ఊపందుకునేలా చేయగలమన్నారు. ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా 1991లో ఆర్ధిక సంస్కరణలు చేపట్టిన తరహాలో వ్యాపారాలకు సంబంధించిన అడ్డంకులను తొలగించేందుకు సలహా ఇచ్చేందుకు అత్యంత ఉన్నతమైన, నిపుణులైన వ్యక్తులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ రెండూ చేయగలిగితే మనం తిరిగి గాడిలో పడడం తధ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు.
మన క్రమశిక్షణ సరిపోదు…
బ్యాంకు రుణాల ద్వారా స్టార్టప్స్, చిన్న తరహా కంపెనీలకు తోడ్పాటు అందించాలని, తద్వారా అవి మరో 3 నుంచి 6 నెలల్లో తగిన వర్కింగ్ క్యాపిటల్‌ను పొందడానికి సహకరించాలని సూచించారు. ఇవి ఇంకాస్త ముందుగానే జరిగి ఉండాల్సిందని, అయితే ఇప్పటికీ మించిపోయిందేమీ లేదన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇకపై అనుసరణీయం కానుందా అనేదానికి సమాధానమిస్తూ భారతీయులు మరీ ఎక్కువ క్రమశిక్షణ కలిగిన వారు అని చెప్పలేమని, ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడం తక్షణావసరం కాబట్టి ఉత్పత్తి ప్రమాణాలు తగిన విధంగా నిర్ణయించిన తర్వాత ఎక్కడ నుంచైనా పనిచేయవచ్చునన్నారు.






