TANA: వెల్చేరు నారాయణరావుకు తానా – గిడుగు రామమూర్తి భాషా పురస్కారం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన గిడుగు రామమూర్తి (Gidugu Ramamurthy) పేరు మీద ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రూ.50,000ల నగదుతో కూడిన పురస్కారాన్ని అందజేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు భాషా వికాసానికి, అభ్యున్నతికి విశేషంగా కృషి సల్పిన ప్రముఖులను ఈ పురస్కారంతో తానా గౌరవించి సత్కరిస్తోంది. ఈ పురస్కారాలను తానా 2002 డిసెంబర్ నుంచి ప్రకటిస్తోంది. 2025వ సంవత్సరానికి ఈ పురస్కారాన్ని ప్రముఖ భాషావేత్త, సాహితీవేత్త ప్రొఫెసర్ వెల్చేరు నారాయణరావుగారికి అందజేసింది.
గిడుగు రామమూర్తి (1863-1940) పేరు చెప్పగానే వ్యవహారిక భాషకు ప్రాచుర్యం కల్పించిన వ్యక్తిగా, గొప్ప భాషా శాస్త్రవేత్తగా, పరిశోధకునిగా, సంఘసేవకునిగా గుర్తింపు పొందిన ఆయన భాషాసేవలను స్మరించుకుంటూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన గిడుగు రామమూర్తి పేరు మీద ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తానా పురస్కారాలను అందజేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు భాషా వికాసానికి, అభ్యున్నతికి విశేషంగా కృషి సల్పిన ప్రముఖులను ఈ పురస్కారంతో తానా గౌరవించి సత్కరిస్తోంది. 2025వ సంవత్సరానికి ఈ పురస్కారాన్ని ప్రముఖ భాషావేత్త సాహితీవేత్త ప్రొఫెసర్ వెల్చేరు నారాయణరావుగారికి అందించింది.
ప్రొఫెసర్ వెల్చేరు నారాయణరావు జగమెరిగిన సాహిత్యాధ్యాయి భాషాప్రాంతాల కతీతంగా, ఏ శాస్త్రీయ ప్రమాణాల ప్రకారం చూసినా ప్రపంచంలోని అత్యుత్తమ సాహిత్య పరిశోధకులుగా ఎన్నదగిన నారాయణరావు ఫిబ్రవరి 1, 1932న శ్రీకాకుళం అంబం అనే కుగ్రామంలో జన్మించారు. ఏలూరు.ఆర్. రెడ్డి కళాశాలలో బి.ఏ. డిగ్రీ పూర్తిచేసుకున్న నారాయణరావు ఆ కళాశాలలోనే సుమారు 2 దశాబ్దాలపాటు తెలుగు సాహిత్య అధ్యాపకుడిగా పనిచేశారు. 1974లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. తెలుగులో కవితావిప్లవాలస్వరూపం పేరుతో 1978లో ఆయన ప్రచురించిన పిహెచ్‌డి సిద్ధాంత గ్రంథం నేటికి అధ్యయనకారులకు ఉపయుక్తంగా ఉంది. 1971లో అమెరికా వచ్చిన నారాయణరావు విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో కృష్ణదేవరాయపు పీఠం విశిష్టాచార్యుడి హోదాలో తెలుగు భాషా సాహిత్యాలను 40ఏళ్ళపాటు బోధిస్తూ వచ్చారు. చికాగో విశ్వవిద్యాలయంలో, 2015లో అట్లాంటాలోని ఎమరీ విశ్వవిద్యాలయంలో తెలుగుభాషా సాహిత్యాలను కొద్దికాలంపాటు బోధించారు.
ప్రముఖ సంస్థలలో నారాయణరావు విశిష్ట సభ్యత్వాలు వారి సుదీర్ఘ సమున్నత సాహిత్య ప్రస్థానంలో అందుకున్న అనేకానేక పురస్కారాల్లో కొన్ని మాత్రమే. సంస్కృతేతర భాషాసాహిత్యం, మౌఖిక సాహిత్యం తగినంత గుర్తింపు పొందడంలో నారాయణరావు కృషి అమూల్యమైనది. ఎ.కె. రామానుజన్, సంజయ్ సుబ్రహ్మణ్యం, డేవిడ్ షూల్మన్ వంటి ప్రసిద్ధ సాహిత్య చరిత్రకారులు, అధ్యయనశీలురతో కలిసి భారతీయ మౌఖిక, సాంప్రదాయ సాహిత్య సంస్కృతీ చరిత్రలపై నారాయణరావు చేసిన పరిశోధనలు, వెలువరించిన అధ్యయన ఫలితాలు అనితరసాధ్యమైనవి అనడం అతిశయోక్తి కాదు. అల్లసాని పెద్దన మనుచరిత్రము, పింగళి సూరన కళాపూర్ణోదయము, పాల్కురికి సోమనాథుని బసవపురాణము, నంది తిమ్మన పారిజాతాపహరణము వంటి కావ్య సాహిత్యం మొదలుకొని గురజాడ అప్పారావు కన్యాశుల్కం, చాసో కథలు, విశ్వనాథ సత్యనారాయణ నవలికలు, వచన కవిత్వం వంటి వర్తమాన, ఆధునిక సాహిత్యం దాకా ఇతర అధ్యాపకులతో కలిసి నారాయణరావు ఎన్నో ఆంగ్లానువాదాలు చేశారు. ఇలా వెయ్యేళ్లపాటి సాహిత్యాన్ని ఇంత విస్తృతంగా అధ్యయనం చేసి, అనువదించి, ప్రపంచానికి తెలుగు సాహిత్యంపట్ల ఒక సమగ్రమైన అవగాహన నిచ్చిన వ్యక్తి చరిత్రలో బహుశా మరొకరు లేరు.
నారాయణరావు చేసినవి కేవలం అనువాదాలే అనుకోవడం ఆయన బహుముఖీయమైన కృషిని తక్కువ చేయడమే అవుతుంది. ఒక కావ్యాన్ని కేవలం అనువదించడమేకాక, ఆ కావ్యపు విశిష్టతను, విశ్లేషించి అర్థం చేసుకోవలసిన పద్ధతులను, అనువాదపు సందర్భాన్ని, తద్వారా సాహిత్యచరిత్రను ఒక కొత్త దృక్కోణం నుంచి చూడవలసిన అవసరాన్ని తన అనువాదాలతో పాటు అనుబంధంగా అందించడం ద్వారా సాహిత్యాన్ని ఎలా చదవాలి, ఎందుకు చదవాలి అనేది కూడా తెలియచెబుతూ నారాయణ రావు భావి భాషాసాహిత్య పరిశోధకులకు మార్గదర్శిగా నిలిచాడు.
తెలుగు భాషకు ఇంత సేవచేసిన ఆయనను తానా ఇప్పుడు గిడుగు పురస్కారంతోసత్కరించి ఆయన సాహిత్యసేవను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది.
ఏలూరులో జరిగిన అంబికా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాల్లో డాక్టర్ వెల్చేరు నారాయణరావు గారికి 11వ తానా-గిడుగు రామమూర్తి తెలుగు భాషా పురస్కారాన్ని తానా నాయకులు అందజేసి సత్కరించారు. తానా నాయకులు చందు గొర్రెపాటి, వి.ఎల్.ఎం.ఆర్. వెంకటరావు ఈ అవార్డును ఆయనకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎపి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎపి నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, హిందూ యువజన సంఘం సెక్రటరీ కళారత్న కె.వి. సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.







