అమెరికా బ్రహ్మాస్త్రం….
అగ్రరాజ్యం అమెరికా మరో బ్రహ్మాస్త్రాన్ని తయారు చేస్తోంది. మేలైన ఆధునిక సాంకేతిక నైపుణ్యం, ప్రస్తుత యుద్ద అవసరాలను దృష్టిలో పెట్టుకుని సరికొత్త యుద్ధ విమానాన్ని డెవలప్ చేస్తోంది. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న బీ-21 రైడర్ యుద్ధ విమానాన్నిప్రయోగాత్మకంగా నవంబర్ 2023లో తొలిసారి పరీక్షించారు. తాజాగా దాని ఫొటోలుబయటకు వచ్చాయి. కాలిఫోర్నియాలో ఎడ్వర్డ్స్ వైమానిక స్థావరంలో పరీక్షిస్తున్నప్పుడు తీసిన చిత్రాలవి. రాడార్ సహా శత్రుదేశాల అత్యాధునిక సాంకేతికతకు సైతం చిక్కకుండా ఎగరగలిగే ‘స్టెల్త్ బాంబర్’ కావడం విశేషం. అమెరికా వాయుసేనకు వెన్నెముకగా, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానంగా దీన్ని రక్షణ రంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు.. వచ్చే ఏడాది ఇది విధుల్లో చేరుతుందని అంచనా వేస్తున్నారు.
డిజైన్ చేసేటప్పుడు నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగానే బీ-21రైడర్ పనిచేస్తోందని ఇటీవల సెనేట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కమిటీ ముందు అమెరికా రక్షణ శాఖ ఉన్నతాధికారి ఆండ్రూ హంటర్ వెల్లడించారు.ప్రస్తుతానికి ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు విమానం ఎన్నిసార్లు, ఎంత సమయం గాల్లో ఎగిరింది? ఇంకా ఎన్నిసార్లు పరీక్షిస్తారనే విషయాలను మాత్రం గోప్యంగా ఉంచారు. దీన్ని సాధారణ పేలుడు పదార్థాలతో పాటు అణ్వస్త్రాలను సైతం మోసుకెళ్లేలా రూపొందించారు. దక్షిణ డకోటాలోని ఎల్స్వర్త్ వైమానిక స్థావరంలో వీటిని ఉంచనున్నారు. మిస్సౌరీలోని వైట్మైన్, టెక్సాస్లోని డైస్ వైమానిక స్థావరాలు బ్యాకప్ కేంద్రాలుగా ఉండనున్నాయి.
మొత్తం 100 విమానాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమెరికా వాయుసేన అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఆరు తయారీ దశలో ఉన్నాయన్నారు. వీటిని అమెరికా సహా మిత్రదేశాల రక్షణలోనూ ఉపయోగిస్తామని తెలిపారు. వీటి తయారీని నార్త్రాప్ అనే సంస్థకు అప్పగించారు. తొలి ఐదు విమానాలను ఎలాంటి లాభాపేక్ష లేకుండా అందించనున్నట్లు ఈ కంపెనీ వెల్లడించింది.
బీ-21 రైడర్ వెనకభాగంలో వెడల్పుగా, మందంలో సన్నగా ఉండే ‘ఎగ్జాస్ట్’ ఉన్నట్లు చిత్రాలను బట్టి రక్షణరంగ నిపుణులు విశ్లేషించారు. వేడిని తగ్గించడం కోసమే దీన్ని అలా డిజైన్ చేసినట్లు తెలిపారు. తద్వారా ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ తగ్గి రాడార్కు చిక్కకుండా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎగ్జాస్ట్ పెద్దగా నలుపెక్కకపోవడాన్ని బట్టి చూస్తే ఉద్గారాలను లోపలే చల్లబర్చే సాంకేతికత ఉన్నట్లు తెలుస్తోందని వెల్లడించారు. ఇందుకోసం అంతరిక్ష వాహక నౌకల్లో వాడే ‘థర్మల్ టైల్స్’ను ఉపయోగించి ఉంటారని పేర్కొన్నారు.
ఇంజిన్లపై అదనపు ద్వారం ఉండడం చిత్రాల్లో కనిపిస్తోంది. ఇంజిన్ ప్రధాన ద్వారాలు ఎక్కువ ఎత్తుకు వెళ్తున్నప్పుడు పూర్తి సామర్థ్యంలో గాలిని లోపలకు పంపలేవని.. అప్పుడు అదనపు ఇన్టేక్లు పనిచేస్తాయని నిపుణులు వివరించారు. విమానం పైభాగంలో ఒక చోట ముదురు రంగులో ఉన్న ప్రత్యేక తొడుగు కనిపించడాన్ని బట్టి ఇంజిన్ ప్రధాన భాగం అక్కడే ఉండొచ్చని తెలిపారు. మరోవైపు రెక్కలపై ఉన్న ఇండికేటర్లు తిరిగి లోపలికి ముడుచుకునేలా రూపొందించినట్లు తెలుస్తోందన్నారు. శత్రుదేశాలకు చిక్కకుండానే ఈ ఏర్పాట్లు చేసి ఉండొచ్చని అంచనా వేశారు. వీటితో పాటు లోపల అత్యాధునిక డిజిటల్ సాంకేతికతను ఉపయోగించి ఉండవచ్చని తెలిపారు.







