అమెరికాలో 5 కోట్ల మంది నిరుద్యోగులు
అమెరికాలో నెలకొన్న ఆర్థిక మాంద్యం, కరోనా దెబ్బకు ఏప్రిల్ నెలలో నిరుద్యోగం రేటు 4.4 శాతం నుంచి 14.7 శాతానికి పెరిగిందని బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (బిఎల్ఎస్) పేర్కొంది. నిరుద్యోగ ప్రయోజనాల కోసం నమోదు చేసుకోని వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ అండ్ కాంగ్రెస్ ఆఫ్ ఇండిస్ట్రియల్ ఆర్గనైజేషన్స్ (ఎఎఫ్ఎల్-సిఐఓ) అధ్యక్షుడు రిచర్డ్ ట్రుమ్కా తెలిపారు. 2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్య 5 కోట్ల దాకా ఉంటుందని ట్రుమ్కా అన్నారు.
ఒక్క నెలలోనే నిరుద్యోగుల సంఖ్య 71.4 లక్షల నుంచి 2 కోట్ల 30 లక్షల మందికి చేరినట్లు బిఎల్ఎస్ పేర్కొంది. నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్న 3.16 కోట్ల మందిని ప్రభుత్వ గణాంకాల్లో పరిగణనలోకి తీసుకోలేదని, ఉద్యోగాల కోసం ఎదురుచూసి నిరుత్సాహ పడిన వారిని, పార్ట్‌టైమ్ జాబ్ చేసే వారికి కూడా ఇది లెక్కలోకి తీసుకోలేదని ట్రుమ్కా చెప్పారు. నిరుద్యోగిత రేటు 22.8 శాతం దాకా ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






