దుబాయ్ లో భారత సంతతి బాలిక ఘనత
కరోనాపై ప్రపంచం ప్రకటించిన యుద్ధంలో తానూ భాగస్వామి కావాలనుకుంది దుబాయ్‌కు చెందిన భారత సంతతి బాలిక సుచేత (14). అందుకోసం వినూత్న ప్రయోగం చేసింది. కరోనా వైరస్‌పై అవగాహన కలిగించే పాటను ఏకంగా 20 భాషల్లో ఆలపించింది. భౌతిక దూరం, చేతులు తరచూ శుభ్రపరచుకోవడం వంటి సూచనల్ని ఈ పాట ద్వారా గుర్తుచేసింది. కేరళకు చెందిన ఆమె కుటుంబం, దుబాయ్‌లో స్థిరపడింది. ఇక్కడే దుబాయ్ ఇండియన్ హైస్కూల్లో సుచేత 10వ తరగతి చదువుకుంటోంది. ఏ సందేశాన్నైనా ముందుకు తీసుకెళ్లేందుకు సంగీతాన్ని మించిన మాధ్యమం లేదని, తాను భావించానని, అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నానని ఆమె పేర్కొంది.
తొలుత కేవలం ఆంగ్ల భాషలో సే నో టు పానిక్ అన్న పేరుతో మార్చి 16న తన తొలి పాటను విడుదల చేశానని, తర్వాతి కాలంలో తన తల్లి సాయంతో 20 భాషల్లో ఆలపించానని తెలిపింది. వాటిలో తెలుగు, మలయాళం, బెంగాళీ, అరబిక్, కన్నడ, తుళు, కొంకణి, మరాఠీ, గుజరాతీ, రాజస్థానీ, సింధీ, హిమాచలీ, ఒడియా, మణిపురి, నేపాలీ, ఉర్దూ, పంజాబీ, భోజ్‌పురి, కశ్మీరీ, సంస్కృత భాషలున్నాయి.






