అమెరికా మరో కీలక నిర్ణయం
కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న అమెరికా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతీకారంగా చైనా ఈక్వీటీ మార్కెట్లలో పెట్టాలని నిర్ణయించిన భారీ పెట్టుబడుల్ని నిలిపివేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఫాక్స్ బిజినెస్ ఓ కీలక పత్రాన్ని స్వాధీనం చేసుకుంది. పెట్టుబడుల నిలుపుదలకు సంబంధించి అమెరికా జాతీయ భద్రతా సలహాలదారు డాక్టర్ ఓబ్రియెన్, జాతీయ ఆర్థిక మండలి చైర్మన్ లారీ కడ్లో కలిసి లేబర్ సెక్రటరీ యూజాన్ స్కాలియాకు ఇటీవల రాసిన ఓ లేఖ పాక్స్ బిజినెస్‌లో వెలుగులోకి తెచ్చింది. ఫెడరల్ ఎంప్లాయి రిటైర్మెంట్ ఫండ్‌కు సంబంధించిన నాలుగు బిలియన్ డాలర్ల ఆస్తుల్ని ఫెడరల్ రిటైర్మెంట్ త్రిఫ్ట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు… చైనా ఈక్వీటీల్లో పెట్టుబడి పెట్టడాన్ని శ్వేతసౌధం వర్గాలు వ్యతిరేకిస్తున్నాయని అందులో పేర్కొన్నారు. చైనా ఈక్విటీల్లో నష్టభయం ఎక్కువగా ఉందని ఈ నేపథ్యంలో పెట్టుబడులు పెట్టడం అసంబద్ధమని వివరించారు. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి విషయంలోనూ చైనా సరిగా వ్యవహరించలేదని పేర్కొన్నారు.






