TLCA: అంగరంగ వైభవంగా టిఎల్ సిఎ ఉగాది వేడుకలు

తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది, శ్రీరామనవమి వేడుకలు న్యూయార్క్ లో అంగరంగ వైభవంగా జరిగాయి. సంఘం అధ్యక్షుడు సుమంత్ రామ్ (Sumanth Ram) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు 800మందికిపైగా తెలుగువాళ్ళు కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఈ వేడుకలను పురస్కరించుకుని పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో హైలైట్‌గా నిలిచినది శ్రీరామపట్టాభిషేకం. దాదాపు 60మందికిపైగా పిల్లలు ఈ పౌరాణిక నాటకంలో తమ ప్రతిభను చూపించారు. టిఎల్ సిఎ మాజీ అధ్యక్షుడు అశోక్ చింతకుంట, ప్రసాద్ డబ్బీరు, మాధవి సోలేటిగార్ల దర్శకత్వంలో ఈ నాటకాన్ని ప్రదర్శించారు.
ప్రముఖ పాటల రచయిత అనంత్ శ్రీరామ్ ఈ వేడుకలకు అతిధిగా వచ్చి తన మాటలతో, పాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. తెలుగు సంస్కృతి వైభవంపై ఆయన చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. అలాగే మాటలబాట, మాటకు పాట, పాటకు వేలంపాట పేరుతో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం కూడా హిట్టయింది. ప్రముఖ గాయని కౌసల్య, సాయి చరణ్, స్ఫూర్తి పాటలు ప్రేక్షకులను మైరపింపజేశాయి. సూపర్ హిట్టయిన ఎన్నో సినిమా పాటలను పాడి వారు అందరినీ ఆనందపరిచారు.
ఈ వేడుకల్లో టిఎల్ సిఎ నిర్మిస్తున్న తెలుగు భవనం నిర్మాణానికి ప్రముఖులు డాక్టర్ మోహన్ బాధే గారు 550,000 డాలర్ల భారీ విరాళం ఇచ్చారు. టిఎల్ సిఎ బోర్డ్ చైర్మన్ డాక్టర్ రాజి కుంచం ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎంతోమంది ఈ భవన నిర్మాణానికి తోడ్పాటును అందించారని వారందరికీ కూడా ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సుమంత్ రామ్ మాట్లాడుతూ, ఈ వేడుకల విజయం వెనుక తన టీమ్‌తోపాటు, డోనర్ల సహకారం, వలంటీర్ల కృషి ఉందని తెలియజేశారు. ఈ వేడుకల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించిన కళాకారులకు, గాయనీ గాయకులకు, అనంత్ శ్రీరామ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకలను పురస్కరించుకుని టిఎల్ సిఎ ఉగాది సావనీర్ ను ఆవిష్కరించారు.
ఈ వేడుకలకు టిటిఎ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, తానా మాజీ అధ్యక్షులు జయ్ తాళ్ళూరి, ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపు, మాజీ బోర్డ్ చైర్మన్ హరీష్ కోయతోపాటు టిఎల్‌సిఎ మాజీ అధ్యక్షులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.