Telugu Bhavanam: తెలుగు భవనం త్వరలోనే ఆరంభిస్తాం: టీఎల్‌సీఏ
తెలుగు సారస్వత సాంసృతిక సంఘం (టీఎల్‌సీఏ) కల నెరవేరింది. తమకంటూ ప్రత్యేకంగా ఒక ‘తెలుగు భవనం’ (Telugu Bhavanam) ఉండాలనే టీఎల్‌సీఏ కోరిక తీరింది. లెవిట్టౌన్లోని 1 నార్త్ విలేజ్ గ్రీన్‌లో 6 వేల చదరపు అడుగుల బేస్మెంట్, 6 వేల చదరపు అడుగుల ఫస్ట్ఫ్లోర్తో పెద్ద భవనాన్ని టీఎల్‌సీఏ నిర్మించింది. ఇకపై తెలుగు సంప్రదాయాలను సెలబ్రేట్ చేసుకునే కార్యక్రమాలన్నీ ఇక్కడే జరపుకోవచ్చని టీఎల్‌సీఏ పేర్కొంది. ఈ సందర్భంగా ఈ కల నెరవేరడంతో కీలక పాత్ర పోషించిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఎగ్జిక్యూటివ్ కమిటీ, దాతలు, కమ్యూనిటీ మద్దతుదారులు అందరికీ టీఎల్‌సీఏ ధన్యవాదాలు తెలిపింది. ముఖ్యంగా ఈ భవన నిర్మాణం కోసం ఏకంగా 5 లక్షల డాలర్లు విరాళం ఇచ్చిన డాక్టర్ మోహన్ బాధేకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. త్వరలోనే అధికారికంగా ఈ భవనాన్ని (Telugu Bhavanam) ఓపెన్ చేస్తామని టీఎల్‌సీఏ చైర్‌వుమన్ రాజీ కుంచం ప్రకటించారు.







