అట్టహాసంగా టీ ఎల్ సి ఏ (TLCA) ‘‘తెలుగు భవనం’’ ప్రారంభం

న్యూయార్క్ నగరంలో తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) అమెరికా దేశంలో ప్రారంభమైన మొదటి తెలుగు సంఘం అని అందరికీ తెలుసు. కమ్యూనిటికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాల నిర్వహణకోసం టిఎల్ సిఎ నాయకులు లెవిట్టన్ కౌంటీలో ఒక సువిశాలమైన బిల్డింగ్ కొనుగోలు చేసి ‘‘ తెలుగు భవనం’’ అనే పేరుతో అనేక మంది తెలుగు పుర ప్రముఖుల మధ్య, సెనేటర్ లు, కాంగ్రెస్ మెన్, కౌంటీ అఫిషియల్స్ మధ్య వేద మంత్రాల మధ్య అట్టహాసంగా ప్రారంభించారు.
దాదాపు 1.4 మిలియన్ డాలర్ల ఖర్చుతో తయారయిన ఈ తెలుగు భవనానికి దాదాపు 500,000 డాలర్లకు పైగా విరాళమిచ్చిన డా. మోహన్ బాదే తల్లి తండ్రులు బాదే నారాయణ స్వామి మరియు కమలమ్మ గారి పేరు పెట్టటమే కాకుండా డా. మోహన్ బాదే, శ్రీమతి రత్నమాలచే ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
మొదటగా శ్రీమతి రాజి కుంచం, చైర్ పర్సన్, టీ ఎల్ సి ఏ బోర్డు మాట్లాడుతూ ఈ భవనం తెలుగు వారి ప్రతిభకి ఆత్మ గౌరవానికి నిదర్శనం అన్నారు. పెరుగుతున్న తెలుగు కమ్యూనిటీకి ఒక సొంత భవనం ఉండాలని అనుకున్నామని, అనేక మంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చారని వారి సహకారం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. విరాళాలు ఇచ్చిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రభుత్వ అతిథులందరికి స్వాగతం పలికారు. చిన్న కార్యక్రమాలకు అనుగుణంగా ఉంటుందని, ముందు ముందు లైబ్రరీ లాంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నదని అన్నారు.. న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ ప్రత్యేకంగా టీ ఎల్ సి ఏ కి తెలుగు భవనం సందర్భంగా ఒక ప్రోక్లమేషన్, అదే విధంగా అనేక ప్రదేశాలనుంచి కౌంటీ ల నుంచి ప్రోక్లమేషన్ లు, అప్రిసియేషన్ సర్టిఫికెట్స్ ఇచ్చారు.
టీ ఎల్ సి ఏ ప్రెసిడెంట్ సుమంత్ రామిశెట్టి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి అఫీషియల్స్ రావడం టీ ఎల్ సి ఏకి ఉన్న పలుకుబడి ఏమిటో చెపుతోంది అన్నారు. తెలుగు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం తెలుగు సంఘాలకే ఒక మైల్ స్టోన్ లాంటిది అని, తాను ప్రెసిడెంట్ గా ఉన్న సంవత్సరంలో జరగటం తన అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. పూర్తి వివరాలతో కూడిన సమాచారంతో, ఫోటోలతో దీనికి సంబంధించిన వివరాలను అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు టిఎల్ సిఎ ప్రముఖులు ఇతరులు పాల్గొన్నారు.