CA: తెలంగాణలో డిజిటల్ స్కూళ్ల ఏర్పాటుకు ఎన్నారైలు ముందుకురావాలి.. కాలిఫోర్నియాలో టీఫైబర్ ఎండీ వేణుప్రసాద్ వినతి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్నీరంగాల్లో అభివృద్ధిపరిచేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా యువతకు అవసరమైన ఉద్యోగాల కల్పనకోసం విదేశీ పర్యటనలు నిర్వహించి రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చేందుకు కృషి చేశారు. అలాగే విద్యారంగాన్ని కూడా అభివృద్ధిపరిచి విద్యార్థులకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్కూళ్ళలో మౌళిక సదుపాయాలు కల్పించడంతోపాటు డిజిటల్ క్లాస్‌రూంలు, ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఐటీ మంత్రిత్వశాఖకు చెందిన తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ (టి ఫైబర్)సంస్థ మొత్తం 26 వేలకుపైగా స్కూళ్లను డిజిటలైజ్ చేయడానికి కృషి చేస్తోందని ఆ సంస్థ ఎండి వేణు ప్రసాద్ (Venu Prasad) చెప్పారు.
ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియా (California) రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ విషయమై ఇక్కడి ఎన్నారైలతో మాట్లాడారు. ఇప్పటికే 8 వేల గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం, ఇతర సదుపాయాలు కల్పించేందుకు రూ.3500 కోట్లు ఖర్చుపెట్టినట్లు వెల్లడిరచారు. అయితే మరిన్ని స్కూళ్లకు వర్చువల్ క్లాస్‌రూంలు అందించేందుకు ప్రైవేటు కంపెనీలు, ఎన్జీవోలు, ఎన్నారైల సహకారాన్ని ప్రభుత్వం కోరుతోందని వేణు ప్రసాద్ చెప్పారు. ఇప్పటికే ఎక్విప్ అనే సంస్థ తమ టీఫైబర్‌తో కలిసి మొత్తం 26 వేలకుపైగా స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించడానికి అవసరమైన ఆన్‌ల్కెన్ స్ట్రక్చర్‌ను రూపొందించిందని, ఎన్నారైలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వేణు ప్రసాద్ కోరారు.
ఫోర్సిస్ ఇంక్ సిఇఒ శ్రీ జెపి వేగేంద్ర టి ఫైబర్ చేస్తున్న కార్యక్రమాన్ని స్వాగతించారు. దాదాపు 1000 పాఠశాలలకు కాలిఫోర్నియా రాష్ట్రం నుంచి సహాయం అందేలా కృషి చేస్తామన్నారు. విద్యారంగంలో ఈ రకమైన గొప్ప కార్యక్రమానికి సంవత్సరానికి 250 డాలర్లు లేదా 5 సంవత్సరాలకు 850 డాలర్లు విరాళం ఇవ్వడం పెద్ద పని కాదని అన్నారు. బే ఏరియాలో అనేక కమ్యూనిటీ సంఘాలు ఉన్నాయని, సరైన ప్రతిపాదనలతో టి ఫైబర్ నుండి వస్తే తామంతా మద్దతు ఇస్తామని బే ఏరియాలో కమ్యూనిటీ లీడర్ గా ఉన్న శ్రీమతి విజయ ఆసూరి అన్నారు.
తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరంకు చెందిన శ్రీ మహేందర్ గూడూరు మాట్లాడుతూ, యాదాద్రి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌లో తాము ఇప్పటికే సహకారాన్ని అందిస్తున్నామని, ఇలాంటి పనులకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.
తానా జాయింట్ సెక్రటరీ వెంకట్ కోగంటి మరియు ఐటీ సర్వ్-బే ఏరియా చాప్టర్ మాజీ అధ్యక్షుడు హరి గక్కిన, తెలుగు టైమ్స్ ఎడిటర్, సిఇఓ సుబ్బారావు చెన్నూరి కూడా పాఠశాలలకు నిధుల సేకరణకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. ఫాల్కన్‌ఎక్స్ నుండి డాక్టర్ రమేష్ కొండా, ఎక్విప్ నుండి శ్రీ సాయి కిరణ్ సమావేశాన్ని సమన్వయం చేశారు.