కోవిడ్ 19 సంక్షోభం… పేదలకు నిత్యావసర సరుకులను అందించిన టీడిఎఫ్
అమెరికాలో నాన్ ప్రాపిట్ ఆర్గనైజేషన్‌గా ఏర్పడిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టిడిఎఫ్) అటు అమెరికాలోనూ, ఇటు తెలంగాణలోనూ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే టీడిఎఫ్ ఇండియాలో కూడా అనేక కార్యక్రమాలను చేస్తోంది. టీడిఎఫ్ అధ్యక్షురాలు కవితా చల్లా ఆధ్వర్యంలో ఇండియాలో కూడా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కోవిడ్ 19, లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారిని ఆదుకునేందుకు టీడిఎఫ్ ఇండియా విభాగం ముందుకు వచ్చింది. టీడిఎఫ్ ఇండియా విభాగం ప్రెసిడెంట్ వట్టె రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి మట్టా రాజేశ్వర్ రెడ్డి చొరవ తీసుకుని రాచకొండ పోలీస్ కమిషనర్‌తో సంప్రదించి పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. నిత్యావసర వస్తువుల పంపిణీలో టీడిఎఫ్ టీమ్ భౌతిక దూరాన్ని పాటిస్తూ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, అడిషనల్ డీసిపి శిల్పవల్లి, షెనా మెహ్రా ఎస్హెచ్ఓ, కార్పొరేటర్ పావని రెడ్డి, ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దాదాపు 150 మంది నిరుపేదలకు, 50 మంది వికలాంగులకు ఈ సందర్భంగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
టిడిఎఫ్ యుఎస్ఎ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసింది. ఈ సందర్భంగా టీడిఎఫ్ యుఎస్ఎ ప్రెసిడెంట్ కవితా చల్లా మాట్లాడుతూ, కరోనా సంక్షోభంలో ఇబ్బందులు పడుతున్నవారిని ఆదుకుంటామని చెప్పారు. అవసరమైనవారికి టీడీఎఫ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలను మరిన్ని చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన టీడిఎఫ్ ఇండియా టీమ్‌ను ఆమె అభినందించారు.
టీడిఎఫ్ ఇండియా విభాగం మరింతమంది పేదలకు సహాయపడాలని భావిస్తోంది. దాతలు, మద్దతుదారుల సహాయంతో ఎంతోమందికి నిత్యావసర వస్తువులను అందించాలని అనుకుంటోంది. ఈ కార్యక్రమానికి సహాయపడాలనుకున్నవారు టీడిఎఫ్ నిర్వాహకులను సంప్రదించవచ్చు.
ఇతర వివరాల కోసం www.telangana.org ను చూడండి.






