ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 166వ సాహిత్య సదస్సు

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 166వ సాహిత్య సదస్సు నెల నెలా తెలుగు వెన్నెల శీర్షికన వర్చువల్ గా మే 16వ తేదీన జరిగింది. చిన్నారి మాడ సమన్విత ప్రార్థనా గీతంతో సాహిత్య సదస్సు ప్రారంభమైయింది. ఈ మాసపు సాహిత్య సభకు ముఖ్య అతిథిగా సిలికానాంధ్ర పూర్వ కార్యదర్శి, గజల్ గేయ రచయిత శ్రీ తల్లాప్రగడ రావుగారు విచ్చేసి “గజల్ కీర్తన సాహిత్య ప్రక్రియలు” అన్న అంశం పై ప్రసంగించారు. జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథిని పరిచయం చేస్తూ వారి సాహిత్య సభకు ప్రస్థానాన్ని తెలియజెప్పారు. ఛందస్సు పరంగా గజల్ కూ గేయానికీ కీర్తనలకూ ఉన్న పోలికలనూ, గజల్ ప్రక్రియ స్వరూప స్వభావాలనూ విస్తారంగా వివరించి, స్వయంగా వారు రాసి స్వర పరచిన గజళ్ళను స్వీయగాత్రంతో రావుగారు చక్కగా పాడి వినిపించి మెప్పించారు.
ప్రధాన వక్త ప్రసంగానికి ముందు ప్రతీ మాసం ఎంతో ఆదరణ పొందుతున్న “మనతెలుగు సిరి సంపదలు” ధారావాహిక లో భాగంగా ఉరుమిండి నరసింహా రెడ్డిగారు కొన్నిపొడుపు కథలు, జాతీయాలు, ప్రహేళకలు ప్రశ్నలు జవాబుల రూపంలో చర్చ చేశారు. తరువాతి అంశంగా శ్రీ ఉపద్రష్ట సత్యంగారు “పద్య సౌగంధం” శీర్షికన పిల్లలమఱ్ఱి చినవీరభద్రుడి శాకుంతల కావ్య పీఠికలోని పద్యం “పొసగన్ నే కృతి చెప్పగా పరిమళంబుల్ చాలకొక్కొక్కచో” అన్నపద్యం యొక్క తాత్పర్య విశేషాలను వివరించి చెప్పారు.
లెనిన్ వేముల మాట్లాడుతూ మయూర భట్టు రచించిన సూర్య శతకంలోని ప్రథమ శ్లోకాన్ని వివరిస్తూ కీర్తించారు. మాడ దయాకర్ గారు పుస్తక పరిచయం చేస్తూ డాక్టర్ మహీధర నళినీ మోహన్ గారు రాసిన క్యాలండర్ కథ అన్ననవలలోని అంశాలను వివరించారు. కార్యక్రమంలో చివరిగా డాక్టర్ అరవిందరావు గారు చక్కటి భావ కవితా గేయాలను శ్రావ్యంగా పాడి వినిపించారు. సభలో ప్రసంగాలపై ప్రత్యేకించి ముఖ్యఅతిథి ప్రసంగం పై ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు, ఇతర పెద్దలు తమ సహృదయ స్పందనను తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటి, నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు సమన్వయకర్త శ్రీమతి నీరజా కుప్పాచి తదితర కార్వవర్గ సభ్యులు, పాలకమండలి సభ్యుల, స్థానిక సాహిత్య ప్రియులు హాజరయ్యారు. వారు ముఖ్య అతిథి శ్రీ తల్లాప్రగడరావు గారికి, ప్రార్థనా గీతం పాడిన సమన్విత తో పాటు ముఖ్య కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్య అభిమానులకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.