బే ఏరియాలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

బే ఏరియాలో ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలను అత్యంత ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయంలో జరిగే ఉత్సవాలలో శ్రీరామనవమి వేడుకలను ప్రధానమైనది. ఈ సంవత్సరం వేలమంది భక్తులు చాలా ఉత్సాహాంగా శ్రీసీతారామ కల్యాణాన్ని ఆనందంతో తిలకించారు. విఘ్నేశపూజతో మొదలై, మహాసంకల్పంతో శ్రీరాముడికి వరపూజ జరిగింది. అట్టహాసంగా సాలంకృత సీతమ్మవారిని భక్తులు బుట్టలో మోసుకుని వచ్చినప్పుడు అర్చకులు తెర అడ్డం పట్టి, ముహూర్త సమయానికి అభిజిత్‌లగ్నంలో జీలకర్ర, బెల్లం పెట్టించి కల్యాణం సుసంపన్నం చేశారు. ఆ తరువాత మాంగళ్యధారణ, తలంబ్రాల వేడుకలు జరిగాయి. ముత్యాలతో కలిసిన తలంబ్రాలు రాముడు, సీత పోసుకున్నారు. సీతారామ కల్యాణం యావత్తూ శ్రీ మారేసల్లి నాగ వెంకటశాస్త్రి ఆధ్వర్యంలో జరిగింది. ఇండొనేషియాలో పారిశ్రామికవేత్త అయిన హరనాథరెడ్డి రామాయణం ప్రవచనం చేశారు. అధ్యక్షులు శ్రీ తాడేపల్లి పద్మనాభం అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.