క్వారంటైన్ కు అమెరికా ఉపాధ్యక్షుడు
ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కట్టుదిట్టమైన భద్రత, నిత్యం పటిష్ఠ పహారా ఉండే అమెరికా శ్వేతసౌధం సైతం తన ప్రవేశానికి అతీతమేం కాదని నిరూపిస్తోంది కరోనా వైరస్. ఏకంగా దాని మెడలు వంచేందుకు ఏర్పాటైన కార్యదళాన్నే భయం గుప్పిట్లోకి నెట్టింది. ఇప్పటికే బృందంలో ఉన్న ఉన్నత స్థాయి శాస్త్రవేత్తలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లగా, తాజాగా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సైతం ఇంటికే పరిమితం కావాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల తన సిబ్బందిలోని ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నాటి నుంచి ప్రతిరోజు జరుపుతున్న పరీక్షల్లో నెగిటివ్ అని తేలుతున్నప్పటికీ వైద్యుల సూచన మేరకు ఇతరులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని అధికారులు తెలిపారు.






