కాలిఫోర్నియాలో అనుమానాస్పద స్థితిలో భారతీయ కుటుంబం మృతి
అమెరికాలోని కాలిఫోర్నియా శాన్ మాటెయోలో ఓ భారతీయ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అలమెడ లాస్ పులగాస్ అనే ప్రాంతంలోని బ్లాక్ నంబర్ 4100లో ఈ ఘటన చోటు చేసుకొంది. కేరళకు చెందిన ఆనంద్ సుజాత్ హెన్రీ (42), భార్య అలిస్ బెంజిగర్ (40), నాలుగేళ్ల వయసున్న ఇద్దరు పిల్లల మృతదేహాలను గుర్తించారు. కుటుంబ కలహాలే ఈ మరణాలకు కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. వెల్ఫేర్ చెక్ సమయంలో ఈ ఇంటి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.
ఆ ఇంటిలోకి వెళ్లే అన్ని తలుపులు మూసే ఉన్నాయి. కానీ, ఒక కిటికి తెరిచి ఉండటంతో అధికారులు అందులో నుంచి లోపలకు ప్రవేశించారు. వారికి బూత్రూమ్లో దంపతుల మృతదేహాలు కనిపించాయి. వీరి శరీరంపై తుపాకీతో కాల్చిన గాయాలున్నాయి. సమీపంలో ఒక 9ఎంఎం తుపాకీ, తూటాలను స్వాధీనం చేసుకొన్నారు. ఇంటి పడకగదిలో ఇద్దరు బాలుర మృతదేహాలు కనిపించాయి. వారి శరీరాలపై ఎటువంటి గాయాలు లేవు. దీంతో ఆ చిన్నారులపై విషప్రయోగం వంటివి చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి మరణాలకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.







