ఆ కంపెనీలను రమ్మంటున్న భారత్
కరోనా వైరస్ కారణంగా చైనాలో ఉన్న అగ్రగామి కంపెనీలు మునుపటిలా కార్యకలాపాలు సాగించలేని తేలడంతో ఆ కంపెనీలను ఆకర్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారు. ఆ కంపెనీలు కూడా భారత్ వైపు చూస్తోంది. అమెరికాకు చెందిన 1000 కంపెనీలను ఎలాగైనా భారత్ రప్పించాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. ఆ కంపెనీల్లో అగ్రగామి ఫార్మా సంస్థ అబ్బాట్ ల్యాబొరేటరీస్ కూడా ఉంది. ఏప్రిల్ లోనే కేంద్రం ఆయా కంపెనీల యాజమాన్యాలతో వివిధ మార్గాల్లో సంప్రదింపులు జరిపింది. భారత్ వస్తే భారీ రాయితీలు ఇస్తామని ఆకట్టుకునే ప్రతిపాదనలు వారి ముందుంచింది. చైనా నుంచి వచ్చేయాలనుకుంటున్న కంపెనీల్లో వైద్య ఉపకరణాల తయారీ సంస్థలు, ఆహారశుద్ధి యూనిట్లు, టెక్స్ టైల్స్, తోలు ఉత్పత్తులు, ఆటోమొబైల్ భాగాల తయారీదార్లకు భారత్ ప్రాధాన్యత ఇస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి, పర్యవసానాలకు చైనానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేస్తున్న ఆరోపణలు వాణిజ్య రంగంపై భారీ ప్రభావం చూపిస్తున్నాయి. ఈ పరిస్థితులు భారత్ కు లాభిస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అంచనా వేస్తున్నారు. ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితులు తగ్గాక, భారత్ లో మరో పారిశ్రామిక వెల్లువ కచ్చితంగా సాధ్యమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.






