అమెరికా నుంచి కొన్ని ఔషధాలు వెనక్కి
ఉత్పత్తి, నాణ్యతా పరమైన సమస్యలు ఎదురు కావడంతో అమెరికా విపణి నుంచి కొన్ని మందులను భారతీయ కంపెనీలు వెనక్కి తీసుకుంటున్నాయి. ఈ కంపెనీల్లో డాక్టర్ రెడ్డీస్, గ్లెన్ మార్క్ ఫార్మా, జైడస్ ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, 1,656 బాటిళ్ల మాంటెలుకాస్ట్ సోడియమ్ అనే మందును వెనక్కు తీసుకుంది. దగ్గు, అలెర్జీ, ఇతర ఇబ్బందులకు చికిత్సలో ఈ మందు వినియోగిస్తారు.మాంటెలుకాస్ట్ సోడియం ట్యాబ్లెట్ల బాటిల్లో మెటోప్రొలాల్ 25 ఎంజీ మందు కనిపించడం దీనికి ప్రధాన కారణం. ఇదేవిధంగా గ్లెన్ మార్క్ ఫార్మా, 5,856 బాటిళ్ల డెఫెరసికార్స్ ట్యాబ్లెట్లను వెనక్కి తీసుకుంది. రక్తంలో ఐరన్ ఎక్కువగా ఉన్నప్పుడు, దాన్ని తగ్గించటానికి ఈ ట్యాబ్లెట్ వాడతారు. 16,944 బాటిళ్ల రానొలజైన్ ఈఆర్ ట్యాబ్లెట్లను కూడా గ్లెన్‌మార్క్ ఫార్మా వెనక్కి పిలిపిస్తోంది. జైడస్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన ఆక్సిబుటినిమ్ క్లోరైడ్ ఈఆర్ ట్యాబ్లెట్లను సంస్థ వెనక్కి తీసుకుంటోంది. నాణ్యాతా సమస్యలు దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.






