Bay Area: టీడీపీ కార్యకర్తలతో డాక్టర్ చదలవాడ ఆరవిందబాబు గారి ఆత్మీయ సమావేశం

నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ ఆరవిందబాబు(Dr. Chadalawada Aravinda Babu) గారి అమెరికా పర్యటనలో భాగంగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని బేఏరియా ఎన్నారై టీడీపీ (NRI TDP) కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం శనివారం సాయంత్రం మిల్పిటాస్ లో వేడుకగా జరిగింది.
ఈ కార్యక్రమానికి శ్రీ ఆరవిందబాబు సతీసమేతంగా విచ్చేసి స్థానిక టీడీపీ కుటుంబ సభ్యులతో మమేకమై పలు అనుభవాలు పంచుకున్నారు.
ఎన్నారై టీడీపీ నాయకుడు కోగంటి వెంకట్ ఆధ్వర్యంలో మార్చి 15 న శనివారం సాయంత్రం మిల్పిటాస్ లోని బిర్యానీ జంక్షన్ ఈ కార్యక్రమానికి వేదిక అయ్యింది.
100 మంది పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా హాజరయ్యరు.
ముందుగా వెంకట్ అందరికీ స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా శ్రీనివాస్ తాడపనేని మరియు జాస్తి రజనికాంత్ శాసనసభ్యులు డాక్టర్ ఆరవిందబాబు గారిని పుష్పగుచ్చాలతో వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. తరువాత స్థానిక ఎన్నారైలు ముఖ్యంగా పల్నాడు ప్రాంతానికి చెందిన పలువురు ఎన్నారైలు ఆరవిందబాబు గారిని మరియు శ్రీమతి సుధ గారిని శాలువాలతో సత్కరించారు.
శాసనసభ్యులు ఆరవిందబాబు గారు ప్రసంగిస్తూ తన రాజకీయ ప్రస్థానం, గత ఐదు సంవత్సరాల కాలంలో ఎదుర్కొన్న సవాళ్ళు తదితర విషయాలు వివరిస్తూ, ఒక సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చి డాక్టర్ గా సేవలందిస్తున్న తాను మరింత ప్రజాసేవ చెయ్యాలని భావించినప్పుడు తెలుగుదేశం పార్టీ మాత్రమే ఇందుకు సరైన వేదిక అని భావించానని, ఇందుకు శ్రీ చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వం ఎనలేని తోడ్పాటునిచ్చిందని వివరించారు. తొలిప్రయత్నంలో విజయం సాధించలేకపోయినా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారి పోరాట స్పూర్తితో మరింత పట్టుదలగా పోరాడి మలిప్రయత్నంలో విజయం సాధించానని తెలిపారు.
ఈ విజయంలో ఎన్నారైల పాత్ర అత్యంత ప్రముఖమైనదని, ఎన్నారై టీడీపీ సమన్వయకర్త శ్రీ కోమటి జయరాం గారి సహకారం మర్చిపోలేనిదని, తన విజయానికి కృషి చేసిన ఎన్నారై తెలుగుదేశం సభ్యులకు సదా రుణపడిఉంటానని తెలిపారు.
భవిష్యత్తులో రాష్ట్రాభివృద్దికి ప్రత్యేకించి పలనాడు ప్రాంత అభివృద్దికి ఎన్నారైలు మరింత సహకరించాలని ఆకాంక్షించారు.
కోగంటి వెంకట్ ప్రసంగిస్తూ ఆరవిందబాబుగారి పోరాట పటిమ ప్రతి తెలుగుదేశం కార్యకర్తకీ స్పూర్తిదాయకమని తెలిపారు. ఈ ఎన్నికలలో శ్రీ కోమటి జయరాం గారి మార్గదర్శకత్వం మరియు క్రమశిక్షణ ఎనలేనివని కొనియాడారు. డాక్టర్ కోడెల శివరాంప్రసాద్ గారి తరువాత నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీకి ఆరవిందబాబుగారి లాంటి నిబద్దత కలిగిన నాయకుడు శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం, ఈ విజయంలో ఎన్నారై తెలుగుదేశం కూడా భాగస్వామి కావడం ఆనందించదగిన విషయమని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరయిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
తరువాత ఆరవిందబాబు గారి సతీమణి శ్రీమతి సుధ మాట్లాడుతూ, వైద్యుడిగా సేవలందిస్తున్న ఆరవిందబాబు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా మరింత సేవ చెయ్యాలన్న కోరిక వెలిబుచ్చినప్పుడు మరో ఆలోచన లేకుండా ఏకీభవించానని గుర్తుచేసుకున్నారు. ఈ ప్రయత్నంలో తమకు అండగా నిలిచిన ఎన్నారై తెలుగుదేశం సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయ్ సాగర్ జెట్టి, నరేష్ కొండపల్లి, నరేంద్ర, నవీన్ సమన్వయపరచగా శ్రీనివాస్ వల్లురుపల్లి, వెంకట్ కొల్లా, శ్రీనివాస్ వట్టికూటి, భరత్ ముప్పిరాల, భ్రహ్మ, శ్రీకాంత్ కోనేరు, రమేష్ మల్లారపు, జగదీష్ గింజుపల్లి, రాజేష్ కొండపనేని, వెంకటేష్ కొండపల్లి, నవీన్ కొండపల్లి, నరేంద్ర, శ్రీనివాస నెల్లూరు, తిరుపతిరావు, కాదర్ భాషా, గోపి, సందీప్ ఇంటూరి, అశోక్ మైనేని, రాం తోట తదితరులు హాజరయ్యారు.