మోదీ ప్రభుత్వ దుర్మార్గ చర్యలను నిరసించిన ఎన్నారైలు

ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం ప్రభుత్వాన్ని, పార్టీని ఇబ్బందులపాలు చేసేలా కేంద్రలోని మోదీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ద్వారా, ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా చేయిస్తున్న దుర్మార్గపు చర్యలను నిరసిస్తూ బే ఏరియాలోని ఎన్నారైలు శాన్‌ప్రాన్సిస్కోలోని కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఎదుట నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి డిప్యూటీ కాన్సులేట్ జనరల్ రోహిత్ రతీష్ ద్వారా వినతిపత్రాన్ని పంపించారు. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరగనీయకుండా ఎన్నికల కమిషన్, ఇన్‌కమ్ ట్యాక్స్, ఇడి వంటి సంస్థలను దుర్వినియోగపరుస్తూ, నిజాయితీగా పనిచేస్తున్న అధికారులను బదలీ చేయిస్తూ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులపై ఇన్‌కమ్‌ట్యాక్స్ దాడులు చేయిస్తూ వారు ప్రశాంతంగా ఎన్నికల్లో ప్రచారం చేసుకోనీకుండా అడ్డుపడుతున్నారని ఇలాంటి దుర్మార్గపు చర్యలను వెంటనే ఆపివేయించాలని వారు ఆ వినతిపత్రంలో డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా చూడాలని, నిజాయితీగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులను బదలీలు చేయడాన్ని ఆపివేయాలని, రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలను భయపెట్టేలా చేస్తున్న ఇన్‌కమ్‌ట్యాక్స్ దాడులను వెంటనే ఆపేయాలని కోరారు. ఓటర్ జాబితాను పరిశీలించాలని, బ్యాలెట్ బాక్స్‌ల ద్వారా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడకుండా చర్యలు చేపట్టాలని కూడా వారు ఆ వినతిపత్రంలో కోరారు.
వెంకట్ కోగంటి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సతీష్ అంబటి, సుబ్బ యంత్ర, లక్ష్మీపతి, వెంకట్ కోడూరు, పోతినేని శ్రీనివాస్, గుమ్మడి విజయ్, భాను పొలిశెట్టి, జోగినాయుడు, శ్రీని వల్లూరిపల్లి, రజనీకాంత్, సుభాష్, అనిల్, అంజిబాబు, శ్రీనివాస్ కోగంటి, ఎంవి రావు, హేమంత్, సురేష్ పోతినేని, వెంకట్ తాడికొండ, సతీష్ కొండపర్తితోపాటు 30 మందికిపైగా ఎన్నారైలు పాల్గొన్నారు,