BEA2025: టిటి బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు వేడుకలకు అంతా సిద్ధం
న్యూజెర్సిలో మే 24న అవార్డుల ఫంక్షన్… ప్రముఖుల రాక
న్యూజెర్సిలో జరగనున్న తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ (Telugu Times Business Excellence Awards) 2025 వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు తెలుగు ట్కెమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు తెలిపారు. ఈ అవార్డు వేడుకల వివరాలు ఆయన మాటల్లో…
తెలుగు టైమ్స్ ప్రారంభించిన బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డు వేడుకలు గతంలో కాలిఫోర్నియాలోనూ, డల్లాస్‌లోనూ వైభవంగా జరిగాయి. వివిధరంగాల్లో ప్రతిభ చూపినవారికి ఈ వేడుకల్లో అవార్డులను అందజేశాము. అలాగే న్యూజెర్సిలో కూడా ఈ అవార్డుల వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అవసరమైన అన్నీ ఏర్పాట్లను చేశాము. న్యూజెర్సిలో ఈ అవార్డుల వేడుకలను చేయాలని ఎందుకు అనుకున్నామంటే అన్నీ రంగాలకు చెందిన తెలుగువాళ్ళు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు. అలాగే అన్నీరకాల సంస్థలు ఇక్కడ కనిపిస్తాయి. సిలికాన్ వ్యాలీ తీసుకుంటే అక్కడ మీకు ఐటీ వాళ్ళు మాత్రమే కనిపిస్తారు. కాని న్యూజెర్సిలో అలా కాదు… ఇక్కడ ఐటీ వాళ్ళతోపాటు ఫార్మా రంగంలో పనిచేస్తున్నవాళ్ళు కనిపిస్తారు. ఫైనాన్సు రంగంలో పనిచేస్తున్నవాళ్ళు ఉన్నారు. అలాగే అనేక బంక్ లు, సిపిఎలు, ఇన్సూరెన్స్ ఏజంట్లు ఎక్కువమంది కనిపిస్తారు. ఇలా అన్నీ రంగాలకు చెందినవారు ఇక్కడ ఉండటం వల్ల ఈ ప్రాంతంలో తెలుగు టైమ్స్ బిజినెస్ అవార్డు వేడుకలను ఇక్కడ నిర్వహిస్తున్నాము.
ఈ అవార్డు వేడుకలకు ఎంతోమంది అమెరికా ప్రతినిధులు, భారతీయ కాన్సులేట్ ప్రతినిధులు రానున్నారు. జాతీయ, ప్రాంతీయ తెలుగు సంఘాల నాయకులు కూడా ఈ వేడుకలకు హాజరవుతున్నారు. తానా, ఆటా, నాట్స్, టిటిఎ, ఎన్నారై విఎ వంటివాటితోపాటు స్థానిక తెలుగు సంఘాలైన టిఎల్‌సిఎ, టిఫాస్, ఇతర తెలుగుసంఘాల నాయకులు ఈ వేడుకలకు వస్తున్నారు. అలాగే ఐటీ సర్వ్, ఎఫ్‌ఐఎ, ఐఎన్‌ఓసి వంటి సంఘాలు కూడా ఈ వేడుకలకు వస్తున్నాయి.
న్యూయార్క్ లోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా బినయ్ కుమార్ ప్రధాన్ ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. గెస్ట్ ఆఫ్ హానర్లుగా న్యూయార్క్ ఎఫ్‌ఐఎ చైర్మన్ అంకుర్ వైద్య, ఎడిసన్ మేయర్ శ్యామ్ జోషి, మోన్రో మేయర్ స్టీఫెన్ డెలినా, పికాసాటవే మేయర్ బ్రైన్ వాహ్లర్ హాజరవుతున్నారు. వీరితోపాటు మరికొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా వస్తున్నారు.
చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసారి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్స్ ఈ వేడుకకు ఆర్గనైజింగ్ పార్టనర్‌గా ఉంది. ఆ సంస్థ చైర్మన్ అంకుర్ వైద్య ఈ వేడుకల్లో పాలుపంచుకుంటున్నారు. ఫిలడెల్ఫియా, హారీస్‌బర్గ్‌లో ఉన్న టీవీ యాంకర్ శ్రీలక్ష్మీగారు ఈ కార్యక్రమానికి టీవీ హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
గతంలో రెండుసార్లు నిర్వహించిన తెలుగు టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ లో కేవలం పదిమందికి మాత్రమే అవార్డులను ఇవ్వడం జరిగింది. కాని ఈసారి ఈ సంఖ్య బాగా పెరిగేటట్లు కనిపిస్తోంది. దానికి ముఖ్యకారణం ఏమిటంటే చాలామంది ఈ అవార్డును ప్రతిష్టాత్మకంగా భావించడమే. దానికితోడు ఈ అవార్డులను తీసుకున్నవారు కూడా మరికొంతమందికి ఈ అవార్డులకోసం రెఫర్ చేయడం జరిగింది. దీంతోపాటు తెలుగు సంఘాలకు చెందిన నాయకులు కూడా ఈ అవార్డులకోసం కొంతమందిని నామినేషన్ వేయాల్సిందిగా కోరడం జరిగినట్లు తెలిసింది. ఇలా వివిధ వర్గాలవారు ఇచ్చిన రెఫరెన్స్‌లు, వచ్చిన నామినేషన్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందువల్ల ఈసారి అవార్డుల సంఖ్య కూడా పెరుగుతుందని భావిస్తున్నాము.
ఈ వేడుకలు జరిగే న్యూ జెర్సీలోని మొఘల్ బాల్ రూమ్ చాలా సెంటర్ ప్లేసుగా చెబుతారు. మే 24వ తేదీన జరిగే ఈ అవార్డుల కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు సోషల్ హవర్, నెట్ వర్కింగ్ అవర్ ఉంటుంది. తరువాత 5:30 కి వేడుకల కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 9.30వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని మీడియా పార్టనర్‌గా ఉన్న టీవీ 9 లైవ్ చేయనున్నది. మరుసటిరోజున కూడా ఈ వేడుకలు టీవీ 9లో ప్రసారమవుతాయి.
ఈ వేడుకలకు అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము.







