భారత్ కు యాపిల్!
కరోనా వైరస్ నేర్పిన గుణపాఠంతో అంతర్జాతీయ టెక్ దిగ్గజం యాపిల్ ఇప్పుడు భారత్‌వైపు చూస్తున్నది. ఈ వైరస్‌కు పుట్టినిల్లయిన చైనా నుంచి తమ ఉత్పత్తి కార్యకలాపాల్లో ఐదో వంతు భాగాన్ని భారత్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నది. ప్రస్తుతం తమ స్మార్ట్ ఫోన్లతో పాటు ఇతర గ్యాడ్జెట్ల తయారీ కాంట్రాక్టులను ఫాక్స్‌కాన్, విస్ట్రన్ లాంటి సంస్థలకు ఇస్తున్న యాపిల్.. భారత్‌లో దాదాపు 4 వేల కోట్ల డాలర్ల విలువైన స్మార్ట్ఫోన్లను తయారు చేసేందుకు ఈ కాంట్రాక్టర్లను ఉపయోగించుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆ సంస్థ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే పీఎల్ఐ పథకంలో కొన్ని అవరోధాలున్నాయని, వాటిని తొలగించాలని యాపిల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు ఈ వ్యవహారంతో సంబంధమున్న అధికారవర్గాలు వెల్లడించాయి.
పీఎల్ఐ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఏ కంపెనీ అయినా 2020 నుంచి 2025 మధ్యకాలంలో దశలవారీగా కనీసం వెయ్యి కోట్ల డాలర్ల విలువైన మొబైల్ ఫోన్లను తయారు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ పథకానికి ఎంపికైన కంపెనీ తమ వార్షిక లక్ష్యాలను తప్పక అధిగమించాల్సి ఉంటుంది. ఆగస్టు 1 నుంచి ప్రారంభమయ్యే ఈ పథకానికి ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలను ప్రకటించనున్నది. ఈ మార్గదర్శకాలు జారీ అయిన వెంటనే యాపిల్‌తోపాటు శాంసంగ్, వివో, ఒప్పో లాంటి స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు కూడా పీఎల్ఐ పథకానికి దరఖాస్తు చేసుకొనే అవకాశమున్నది.






