రివ్యూ : పది లక్ష్యాల ‘రావణాసుర’

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
బ్యానెర్లు : అభిషేక్ పిక్చర్స్, ఆర్.టి.టీం వర్క్స్,
నటీనటులు: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, దక్ష నగర్కర్,
పూజిత పొన్నాడ, శ్రీరామ్, రావు రమేష్, జయరామ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తది తరులు నటించారు.
సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్ ఎడిటర్: నవీన్ నూలి
సంగీత దర్శకులు: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో
నిర్మాతలు: అభిషేక్ నామా, రవితేజ దర్శకుడు : సుధీర్ వర్మ
విడుదల తేదీ: 07.04.2023
మాస్ కమర్షియల్ స్టఫ్ ఇచ్చే హీరో మాస్ మహారాజా రవితేజ. గతేడాది ‘ధమాకా’తో, ఈ సంవత్సరం ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బస్టర్లు కొట్టారు. ఇదే ఏడాది మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అంటూ ‘రావణాసుర’గా ఈరోజు (ఏప్రిల్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రవితేజలో నెగిటివ్ షేడ్‌తో టైటిలే కాకుండా ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆవిష్కృతమయ్యాయి. మరి సినిమాలో రవితేజ మంచి హీరో కాదా? నిజంగానే ఆ నెగిటివ్ షేడ్‌లో కనిపించారా? సినిమా ఎలా ఉంది? ఇప్పుడు రివ్యూ లో తెలుసుకుందాం.
కథ:
కనకమహాలక్ష్మి (ఫరియా అబ్దుల్లా) దగ్గర జూనియర్ లాయర్‌గా పనిచేసే రవీంద్ర (రవితేజ) రకరకాల వ్యక్తుల ముసుగులో హత్యలు చేస్తుంటాడు. తాను ముసుగుగా వాడుకున్న వ్యక్తులనే ఈ హత్యల్లో నేరస్తులుగా చిత్రీకరిస్తాడు. చిన్న ఆధారం కూడా వదలకుండా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతూ ఉంటాడు. అయితే ఓ రోజు హారిక(మేఘా ఆకాష్) తన తండ్రి(సంపత్ రాజ్) ని ఓ మర్డర్ కేసులో ఎవరో ఇరికించారు అని ఆ కేసు కనక మహాలక్ష్మి దగ్గరకి వస్తుంది. కానీ హారిక ని చూసిన రవీంద్ర ఆమెని మొదటి చూపు లోనే ఇష్టపడి పర్సనల్ ఇంట్రెస్ట్ తో ఈ కేసును తాను తీసుకుంటాడు. కానీ ఇక్కడ నుంచి ఈ కేసులో మరిన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. మరి ఈ మర్డర్స్ చేసింది ఎవరు? ఎందుకు చేస్తున్నారు? ఈ కథలో మిగతా హీరోయిన్ పాత్రలు ఏంటి? ఆ కిల్లర్ దొరుకుతాడా అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే!
నటీనటుల హావభావాలు:
ఈ సినిమాలో వన్ అండ్ ఓన్లీ అట్రాక్షన్ రవితేజ. మాస్ మహారాజా వన్ మ్యాన్ షో ఇది. కామెడీని పండించడం, రొమాన్స్ చేయడం, గాల్లో ఎగురుకుంటూ ఫైట్లు చేయడం రవితేజకు నల్లేరు మీద నడకు. కానీ, ఈ సినిమాలో కొత్తదనం చూపించారు. తనలోని వికృతమైన విలనిజాన్ని ప్రదర్శించారు. రావణాసుర టైటిల్‌కు న్యాయం చేశారు. సినిమాలో ఎంత మంది ఉన్నా మన మైండ్ రవీంద్ర పాత్ర చుట్టూనే తిరుగుతుంటాయి. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్ర సాకేత్. ఈ పాత్రను సుశాంత్ పోషించారు. సుశాంత్‌లో నటుడిగా పరీక్ష పెట్టేంత బలమైన పాత్రేమీ కాదు ఇది. సాదా సీదా పాత్ర ఆయన బదులు ఎవరు చేసినా ఆ పాత్రలో పెద్ద తేడా ఉండదు. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో రాజు, ‘రావణాసుర’లో సాకేత్ గా సుశాంత్ వైవిధ్యమైన నటనకు పెద్దగా తేడా ఉండదు.
ఇక ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, దక్ష నగర్కర్, పూజిత పొన్నాడ ఇలా ఐదుగురు అందమైన అమ్మాయిలు ఐదురకాల పాత్రలు పోషించారు. వీళ్లందరినీ హీరోయిన్లు అనడం కరెక్ట్ కాదు. కథకు అవసరమైన ఐదు రకాల పాత్రల్లో నటించారని చెప్పాలి. ఇద్దరు హీరోయిన్లకు మాత్రం పాటల్లో రవితేజతో డాన్స్ వేసే ఛాన్స్ వచ్చింది. ఇంకొకరికి రొమాన్స్ చేసే అవకాశం దక్కింది. ఇంకో ఇద్దరికి రవితేజతో సంబంధమే లేదు. కానీ, ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు. ఫరియా అబ్దుల్లా చేసిన కనకమహాలక్ష్మి పాత్ర ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. అను ఇమ్మాన్యుయేల్ ఓ మూడు సార్లు కనిపిస్తుంది. పూజిత పొన్నాడ, దక్ష పాత్రలకు ప్రాముఖ్యత ఉంది. ఆ తరవాత హైపర్ ఆది వన్‌లైన్ పంచ్‌లతో సినిమా ప్రారంభంలో నవ్వించాడు. హర్షవర్ధన్‌పై ఆది వేసే పంచ్‌లు నవ్వు తెప్పిస్తాయి. సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర ఏసీపీ హనుమంతరావు. ఈ క్యారెక్టర్‌లో మలయాళ సీనియర్ నటుడు జయరాం నటించారు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టినపిండి. ఇక జయప్రకాష్, సంపత్, శ్రీరామ్, రావు రమేష్, మురళీ శర్మ, ప్రవీణ్, తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు.
సాంకేతికవర్గం పనితీరు:
ఇక దర్శకుడు సుధీర్ వర్మ విషయానికి వస్తే.. ‘స్వామి రారా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుధీర్ వర్మ.. ‘దోచేయ్’, ‘కేశవ’, ‘రణరంగం’ వంటి సినిమాలతో క్రైమ్, థ్రిల్లర్ జోనర్ స్పెషలిస్ట్‌గా పేరుతెచ్చుకున్నారు. ఇలాంటి థ్రిల్లర్ చిత్రాలని తాను భాగం హ్యాండిల్ చేస్తాడు. ఇలాంటి దర్శకుడి నుంచి రవితేజ హీరోగా సినిమా వస్తుందంటే కచ్చితంగా అంచనాలు భారీగా ఉంటాయి. రావణాసుర లో కూడా చాలా మంచి మంచి థ్రిల్ ని అలాగే ట్విస్ట్ లతో ఆడియెన్స్ లో మంచి ఆసక్తిని రేపగలిగాడు. అయితే సినిమా మెయిన్ పాయింట్ ని మాత్రం రెగ్యులర్ గా తీసుకోవడం కాస్త నిరాశ కలిగిస్తుంది. ఒక మంచి కథాంశాన్ని ఎంపిక చేసుకున్న సుధీర్ రవ్మ.. దాన్ని తెరపై ఎఫెక్టివ్‌గా చూపిండంలో పూర్తిగా సఫలం కాలేకపోయారు. అలాగే సెకండాఫ్ లో కూడా మరింత జాగ్రత్త వహించి ఉంటే ఓవరాల్ అవుట్ ఫుట్ మరింత సాలిడ్ గా ఉండేది. దీనితో తన వర్క్ కొంచెం యావరేజ్ కి మించి ఉంటుందని చెప్పవచ్చు.
ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎడిటర్ నవీన్ నూలి గురించి. తన ఎడిటింగ్ స్కిల్స్‌తో సరైన నిడివిలో చక్కటి అవుట్‌పుట్ ఇచ్చారు. క్రైమ్ సీన్స్‌లో నవీన్ నూలి పనితనం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక హర్షవర్థన్ రామేశ్వర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఫర్వాలేదనిపిస్తుంది. హర్షవర్థన్ రామేశ్వర్‌తో పాటు భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు పాటలు అందించారు. ఈ పాటలు సినిమా విడుదలకు ముందు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమాలోనూ అంతంతమాత్రంగానే ఉన్నాయి. కాకపోతే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో భాగంగా వచ్చే రావణాసుర థీమ్ బాగుంది. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాతల నిర్మాణపు విలువలు బాగున్నాయి.
విశ్లేషణ:
భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ సినిమాలో గూస్‌బంప్స్ తెప్పించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పెద్దగా ఏమీ లేవు. కాకపోతే ప్రీ ఇంటర్వెల్ నుంచి సెకండాఫ్ మొత్తం రవితేజ చేసే వయోలెన్స్ కొత్తగా అనిపిస్తుంది. సినిమాను కామెడీ, రొమాంటిక్ మూడ్‌తో మొదలుపెట్టిన దర్శకుడు.. క్రైమ్ సీన్‌తో అసలు కథలోకి తీసుకెళ్లారు. రవీంద్ర ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు.. ఈ హత్యల్లో ఒక్కొక్కరిని ఎందుకు ఇరికిస్తున్నాడు వంటి విషయాలను రివీల్ చేశాడు దర్శకుడు. ఈ క్రమంలోనే ‘రావణాసుర’ టైటిల్‌కు నిర్వచనం ఇచ్చారు. రామాయణంలో రావణాసురిడికి పది తలలు ఉంటే.. ఈ ‘రావణాసుర’కు పది లక్ష్యాలు ఉన్నాయి. అయితే, తన పది లక్ష్యాలను ఛేదించడానికి రవీంద్ర ప్రోస్తటిక్ మేకప్‌ను వాడుకుంటాడు. ఈ మేకప్‌తో వేరే వ్యక్తుల్లా మారిపోయి హత్యలు చేస్తుంటాడు. నిజానికి మరో వ్యక్తుల్లా మాస్కులు వేసుకుని విలన్లను మోసం చేసిన హీరోల సినిమాలు గతం లో ఎన్నో చూశాం. ఎన్టీర్ ఎన్నార్ కాలం నుంచి ఇలాంటి సినిమాలు ఉన్నాయి. కానీ, అప్పటి సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలకు మేకప్ టేక్నిక్ డెవలప్ కాలేదు. దాన్ని అధిగమించాలని దర్శకుడు సుధీర్ వర్మ ప్రోస్తటిక్ మేకప్‌తో హీరోని మరో వ్యక్తి రూపంలో చూపించే ప్రయత్నం చేశారు. కానీ, ఇది కూడా లాజికల్‌గా లేదు. ప్రోస్తటిక్ మేకప్‌తో మొహాన్ని మార్చేసినా బాడీ లాంగ్వేజ్ మార్చలేం కదా.
ఇలాంటి మేకప్‌లో భయంకరమైన క్రైమ్‌లు చేయడం, పోలీసులను తప్పుదోవ పట్టించడం ఈ రోజుల్లో అంత సులభమా? దీనికి తోడు ఈ ప్రోస్తటిక్ మేకప్ కోసం వాడిన గ్రాఫిక్స్ కూడా అంతగా కుదరలేదు. ఈ ఇల్లాజికల్ సీన్ల వల్ల మూవీపై కాస్త ఆసక్తి తగ్గుతుంది. రవీంద్ర ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు అనే విషయాన్ని ఒక పోలీస్ ఆఫీసర్ చాలా సింపుల్‌గా రివీల్ చేసేయడం కూడా థ్రిల్లింగ్‌గా అనిపించదు. ఒక క్రిమినల్ లాయర్ తన క్రిమినల్ బుర్రతో ఎలా ఆలోచించాడు, చట్టాన్ని వాడుకొని హత్యలు ఎలా చేశాడు అనే కాన్సెప్ట్‌తో క్లైమాక్స్ ఉంటుంది. ఇది కూడా అంత కిక్ ఇవ్వదు. ఒక హోం మినిస్టర్‌ను చంపడానికి ఈ లాజిక్ సరిపోదు అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే లాజిక్ మిస్ అయిన ఒక కమర్షియల్ థ్రిల్లర్ ఈ మూవీ. లాజిక్కుల గురించి పట్టించుకోకుండా వుండే ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.