KCR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్..!?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను (Jubilee Hills Byelection) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్‌ఎస్ (BRS). ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. సిట్టింగ్ స్థానం కావడంతో దీన్ని నిలబెట్టుకోవడం బీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. అంతేకాక పార్టీ పునర్వైభవం సాధించాలంటే కచ్చితంగా ప్రతి ఎన్నికలో గెలవాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడే పార్టీ కేడర్ లో ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఈ నేపథ్యంలో గెలుపే ఏకైక లక్ష్యంగా సమగ్రమైన కార్యాచరణను రూపొందించేందుకు కేసీఆర్ ఇవాళ ఎర్రవల్లిలోని తన నివాసంలో ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇంచార్జ్ లతో కేసీఆర్ భేటీ కానున్నారు. నియోజకవర్గంలో అనుసరించాల్సిన ప్రచార ఎజెండా, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, బీఆర్‌ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, అలాగే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణికి టికెట్ ఇవ్వడం ద్వారా వచ్చిన సానుభూతిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశాలపై ఆయన నేతలకు స్పష్టమైన సూచనలు చేయనున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, స్థానిక అంశాలు, ప్రత్యర్థుల వ్యూహాలపై ఇంచార్జ్ ల నుంచి ఆయన వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. బుధవారం కేసీఆర్‌తో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా సమావేశమై ప్రచార సరళిపై చర్చించారు.
ఉప ఎన్నిక ప్రచారంలో దూకుడు పెంచాలని నిర్ణయించుకున్న బీఆర్‌ఎస్ పార్టీ, ఈ సమావేశం ద్వారా తమ తుది కార్యాచరణను ఖరారు చేయనుంది. ముఖ్యంగా, ఇంటింటి ప్రచారం ద్వారా ఓటర్లను వ్యక్తిగతంగా కలుసుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టాలని కేసీఆర్ సూచించే అవకాశం ఉంది. దీనితో పాటు, నియోజకవర్గంలోని వివిధ వర్గాలను ఆకట్టుకోవడానికి వీలుగా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్, అలాగే కమ్యూనిటీ సమావేశాలకు పక్కా ప్రణాళికను రచించేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం… బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ప్రచారంలో పాల్గొంటారా? లేదా? అన్నది. ఇవాల్టి సమావేశంలో ఈ విషయంపై ఒక స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కేసీఆర్ ప్రచారం చేస్తే అది పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపి, ఎన్నికల వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తుందని నేతలు భావిస్తున్నారు.
ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో పార్టీలోని ముఖ్య నాయకులందరూ ఉన్నారు. వీరంతా సమన్వయంతో పనిచేస్తూ ప్రచారాన్ని హోరెత్తించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. జూబ్లీహిల్స్ గెలుపును శాసనసభలో తమ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు, రాష్ట్ర రాజకీయాల్లో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఓ మెట్టుగా బీఆర్‌ఎస్ చూస్తోంది.