Yuvan Shankar Raja: ‘షష్టి పూర్తి ‘ సినిమా కోసం తొలిసారి తెలుగు పాట పాడిన యువన్ శంకర్ రాజా
తండ్రి ఇళయరాజా బాటలో నడిచి సంగీత దర్శకునిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్న యువన్ శంకర్ రాజా , గాయకునిగా కూడా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ పాడారు. ముఖ్యంగా ఇళయరాజా స్వర సారధ్యంలో కొన్ని తమిళ పాటలు పాడిన యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) , తొలిసారిగా ‘ షష్టి పూర్తి ‘ (Shashtipoorthi) సినిమా కోసం డైరెక్ట్ గా తెలుగులో పాట పాడారు. ఆ క్రెడిట్, ఆ లక్ తమకు దక్కడం పట్ల చాలా ఆనందం వెలిబుచ్చారు నిర్మాత రూపేష్ , దర్శకుడు పవన్ ప్రభ .
డా. రాజేంద్రప్రసాద్ , అర్చన ముఖ్య తారలుగా , రూపేష్ , ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ( MAA AAIE ) ప్రొడక్షన్స్ పతాకం పై రూపేష్ నిర్మించిన ‘ షష్టిపూర్తి ‘ చిత్రం ఈ నెల 30 న విడుదల కానుంది. ఇప్పటి వరకు ఈ సినిమా లోని రెండు పాటలను, టీజర్ ను విడుదల చేయగా విశేష ఆదరణ లభించింది. ఇప్పుడు మూడో పాట “ రాత్రంతా రచ్చే – మరి నువ్వంటే పిచ్చే , నీ మాటే నచ్చే – మది మరుమల్లై విచ్చే, చూస్తే పడతా – చేస్తే చెడతా కట కటా ..! , పద – దోస్తీ కడతా – కుస్తీ పడతా -వలపు వాకిటా ..! “ ను విడుదల చేశారు. చైతన్య ప్రసాద్ రచించిన ఈ పాటను యువన్ శంకర్ రాజా , నిత్య శ్రీ ఆలపించారు. జంగ్లీ మ్యూజిక్ సంస్థ ఈ పాటను ఆన్ లైన్ లో
రిలీజ్ చేసింది. ఈ సంధర్భంగా యువన్ శంకర్ రాజా మాట్లాడుతూ – “మా నాన్న సంగీత దర్శకత్వంలో ఈ తెలుగు పాట పాడినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా కూల్ సాంగ్. మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నేను కూడా ఈ ‘షష్టిపూర్తి‘ టీమ్ లో భాగమైనందుకు ఐ యామ్ వెరీ హ్యాపీ “ అని చెప్పారు.
దర్శకుడు పవన్ ప్రభ , నిర్మాత – కధానాయకుడు రూపేష్ ఈ పాట గురించి వివరిస్తూ – “ సరిగ్గా సినిమా ఓపెనింగ్ జరిగిన రోజునే ఈ ట్యూన్ ఇచ్చారు ఇళయరాజా గారు . ఈ సిట్యుయేషన్ కి , ఈ పాట మూడ్ కి యువన్ శంకర్ రాజా వాయిస్ అయితే పర్ఫెక్ట్ అని అనుకున్నాం. కానీ, ఇళయరాజా గారు వేరే కొత్త తమిళ సింగర్ తో ఈ పాట పాడించేశారు. తర్వాత మేం పట్టుపట్టడంతో యువన్ శంకర్ రాజాతో పాడించారు. పాట వింటే మీకే అర్దమవుతుంది, యువన్ ఎంత బాగా పాడారో అని. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు ఒకెత్తయితే, ఈ పాట ఫుల్ రొమాంటిక్ జోష్ తో ఉంటుంది. ఈ సినిమా మొత్తం మీద బాగా ఖర్చు పెట్టి తీసిన పాట ఇదే. ప్రసిద్ద కళా దర్శకులు తోట తరణి గారు ఈ పాట కోసం నాలుగు సెట్లు వేశారు. పాట చాలా రిచ్ గా బాగా వచ్చింది” అని చెప్పారు.






